కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి పోతుంది

1 Oct, 2018 03:19 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన నేతలతో మంత్రి కేటీఆర్‌. చిత్రంలో గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌లో చేరిన కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్రలు 

టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు ఖాయం: కేటీఆర్‌  

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు వేసే ఓటు కేసీఆర్‌కు పోతుందన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తోందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆ ఓటు ఢిల్లీకి పోతుందని, టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుందని కేటీఆర్‌ అన్నారు. కోదండరాంకు ఓటేస్తే అది ఎటుపోతదో తెలియదు, అది ఓ అడ్రస్‌ లేని సంస్థ అని ఎద్దేవా చేశారు. అందుకే టీఆర్‌ఎస్‌కే ఓటువేస్తామని ప్రజలంటున్నారని మంత్రి పేర్కొన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఆర్యవైశ్య సంఘం నేతలు, కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఆదివారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆర్యవైశ్య సంఘం నేతలకు మంత్రి కేటీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... ఈసారి కూడా కామారెడ్డిలో షబ్బీర్‌అలీకి ఓటమి తప్పదన్నారు.

ఈసారి గెలిస్తే షబ్బీర్‌ అలీపై మాకు ఐదో విజయం అవుతుందని చెప్పారు. గంప గోవర్ధన్‌ మరోసారి భారీ మెజార్టీతో గెలువబోతున్నారని కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ను బొందపెడతామన్న టీడీపీ.. ఆ పార్టీతోనే జతకట్టిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. కోదండరాం కాంగ్రెస్‌ మనిషైపోయిండు, తెలంగాణ ప్రజల చావుకు కారణమైన పార్టీలతోనే ఆయన పొత్తుపెట్టుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్‌ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ కోసం పోరాడారని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాగానే చంద్రబాబు ఏడు మండలాలను గుంజుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని ఎమ్మెల్యే పదవుల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతిలో తాకట్టు పెడతామా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

60 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెసోళ్లకు తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదని విమర్శించారు. చనిపోయిన వాళ్ల పేర్ల మీద కేసులు వేసి ప్రాజెక్టులను ఆపేందుకు కుట్రలు చేశారన్నారు. మన నీళ్లు మనం తెచ్చుకుంటుంటే కాంగ్రెస్‌ నేతలు మోకాలు అడ్డుపెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కాంగ్రెస్‌కు తోక పార్టీ అయిందన్నారు. ముష్టి మూడు సీట్ల కోసం కోదండరామ్‌ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై చంద్రబాబు కత్తిగట్టాడని, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి 30 లేఖలు రాశారన్నారు. కూటమిని గెలిపించి అమరావతిలో చంద్రబాబు వద్ద తెలంగాణ ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టాలా అన్నది ప్రజలు ఆలోచించాలన్నారు.

కాంగ్రెస్, టీడీపీలు దివాళా, దగాకోరు రాజకీయం చేస్తున్నాయన్నారు. ప్రాజెక్టులు అడ్డుకున్న ద్రోహులు కాంగ్రెస్‌ నేతలని, అందుకే ప్రజాకోర్టుకు పోతున్నాం...తీర్పు మీ చేతుల్లోనే ఉందని కేటీఆర్‌ చెప్పారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగే రకం కాంగ్రెస్‌ నేతలని విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. పదవుల కోసం గబ్బిలాల్లా పట్టుకున్న సన్నాసులు కావాలా? తెలంగాణ స్వాభిమానానికి చిరునామా ఆయిన కేసీఆర్‌ కావాలా ఆలోచించుకోవాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏం చేసిందని నిలదీశారు. అగ్రకులాల పేదలకు న్యాయం చేస్తామని, పేదరికమే గీటు రాయిగా పథకాలకు కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తాజా మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు