కిరణ్‌కుమార్‌ రెడ్డిపై కేటీఆర్‌ కామెంట్‌

23 Oct, 2018 17:41 IST|Sakshi

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌: సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా, సింహం లాంటి కేసీఆర్‌ కావాలో తేల్చుకోవాలని ఓటర్లను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కోరారు. మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో 40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. తోడు దొంగలైన కాంగ్రెస్‌, టీడీపీ జట్టు కట్టి సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నాయని విమర్శించారు. రైతులను రాబందులుగా కాల్చుకుతిన్న ఈ రెండు పార్టీలు ఒక్కటైయ్యాయని, తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పట్లో తేలేది కాదన్నారు. ‘వాళ్లు సీట్లు పంచుకునే లోపు మనం స్వీట్లు పంచుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్నివర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎవరు చేయనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అంధకారమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ఆఖరి కిరణం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోపే విద్యుత్‌ సమస్యను అధిగమించామన్నారు. రైతులకు 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ రాకపోయివుంటే ఇవన్నీ జరిగేవా అని ప్రశ్నించారు

మరిన్ని వార్తలు