మోదీ ఆటలు సాగవు

31 Mar, 2019 01:33 IST|Sakshi

బీజేపీ పని అయిపోయింది

వికారాబాద్, తాండూరు రోడ్‌ షోల్లో కేటీఆర్‌

మోదీ మీటర్‌ డౌన్‌ అవుతోంది

16 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి

ఢిల్లీలో ఆత్మాహుతిదళంలా పనిచేస్తారు

రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు

పాలమూరు ఎత్తిపోతలపై కాంగ్రెస్‌ది దొంగనాటకం

మే నుంచి పంట రుణ మాఫీ ప్రారంభిస్తామని వెల్లడి

సాక్షి, వికారాబాద్‌: తెలంగాణ ప్రజలు 16 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి ఢిల్లీకి పంపితే వారు కేసీఆర్‌ సైనికుల్లా పనిచేస్తారని.. అవసరమైతే ఆత్మాహుతి దళం మాదిరిగా పేగులు తెగేలా పోరాడి తెలంగాణకు మేలు చేస్తారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వికారాబాద్, తాండూరులో నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌పై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ప్రధాని మోదీ వేడి తగ్గిందని.. ఆయన మీటర్‌ డౌన్‌ అయ్యిందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, మోదీ ఆటలు సాగవన్నారు. మహబూబ్‌నగర్‌ సభలో మోదీ.. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటిస్తారని.. తాను, వికారాబాద్‌ ప్రజలు

ఎదురుచూశామని, అయితే పెద్ద పెద్ద డైలాగులు కొట్టారే తప్ప, పాలమూరు జాతీయ హోదా, రాష్ట్రానికి నిధుల గురించి ఏమీ మాట్లాడలేదన్నారు. మోదీ హవా ఉందని.. మేం పొడిచేస్తామని బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎడ్డి, గుడ్డిది కాదని, చైతన్యవంతమైన గడ్డ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి మతం పేరు మీద ఓట్లు దండుకునేందుకు బీజేపీ చిల్లరప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సెక్యులర్‌ నాయకుడని, అన్ని మతాల వారిని కలుపుకుని ముందుకు సాగుతున్నారని ప్రజలకు కేసీఆర్‌పై భరోసా ఉందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతినటం ఖాయమన్నారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి ఇక భవిష్యత్తులేదని, అందుకే ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, నాయకులంతా పార్టీని వీడుతున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. 55ఏళ్ల కాంగ్రెస్, 13ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. రెండు పార్టీలు దేశ ప్రజలను మోసం చేశాయని, దేశాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. సీఎంకు ఎంపీ ఎన్నికలకు సంబంధంలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. దీనిని ప్రజలు నమ్మొద్దని.. టీఆర్‌ఎస్‌ నుంచి 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.  
 
మాతో కలిసేందుకు..  
ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్‌కు 16 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాలు వచ్చేలా కృషి చేస్తారని కేటీఆర్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌తో జతకట్టేందుకు వైఎస్‌ జగన్, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్, అఖిలేష్‌ యాదవ్, మాయావతి సిద్ధంగా ఉన్నారన్నారు. ఢిల్లీకి గులాం కావాలో.. తెలంగాణ కోసం పనిచేసే గులాబీ ఎంపీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చెప్పే మోసపూరిత మాటలు నమ్మవద్దని కోరారు. చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి జాతీయపార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. చేవెళ్ల బరిలో ఉన్న రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రంజిత్‌రెడ్డి మీకు సేవకుడిలా పనిచేస్తాడని, చేవెళ్ల అభివృద్ధికి కృషిచేస్తారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్, కొండా ఇద్దరూ సన్యాసం తీసుకోవాల్సిందేని చెప్పారు. మే నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు.
 
అక్కడ కేసులు.. ఇక్కడ పాదయాత్రలా?
పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్‌ నాయకులు దొంగాట ఆడుతున్నారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో ఓవైపు కోర్టులో కేసులు వేస్తూ మరోవైపు వికారాబాద్‌లో పాదయాత్రలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేసి వికారాబాద్, పరిగి, తాండూరులోని రైతులకు సాగునీరు ఇస్తామని ఆయన చెప్పారు. వికారాబాద్‌ జిల్లాను జోగుళాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌లోకి మారుస్తామని, ఆ బాధ్యత తనదేనని చెప్పారు. అనంతగిరి గుట్టలు, పద్మనాభస్వామి ఆలయం, కోటిపల్లి చెరువును పర్యాటక ప్రాంతాలు తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల ఎంపీగా తనకు ఒక్కమారు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎంపీగా గెలిపిస్తే చేవెళ్ల అభివృద్ధికి పనిచేస్తానని, ప్రజాసేవకుడిలా ఉంటానని చెప్పారు. రోడ్‌షోలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ.. భారీ మెజార్టీతో రంజిత్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. రోడ్‌షోలో హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్‌ నేతలు బాలమల్లు, సంజీవరావు, శుభప్రద్‌ పటేల్, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు