మేం గెలుస్తామని విపక్షాలకూ తెలుసు

30 Sep, 2018 01:51 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: ఎవరేం చేసినా మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విషయం విపక్ష నాయకులకూ తెలుసని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. శనివారం సిరిసిల్లలో పలువురు బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే.. ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

నాలుగు దశాబ్దాలపాటు పరస్పరం కొట్లాడుకున్న పార్టీలు సిద్ధాంతా లు, విధానాలను పక్కనబెట్టి కేవలం టీఆర్‌ఎస్‌ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఏకమవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీకి పురుడు పోశారని, కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీకి తోకపార్టీగా మార్చి ఎన్టీఆర్‌కు మరోసారి వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ కన్నతండ్రిలా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని, మంచి చేసేవారిని ప్రజలు కాపాడుకోవాలని చెప్పారు.

వచ్చే తరం కోసమే..
రాష్ట్ర వ్యాప్తంగా అన్నిరంగాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే ఎన్నికల కోసం కాకుండా వచ్చేతరం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పది లక్షల మందికిపైగా ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి సమస్యను పరిష్కరించలేమని స్పష్టం చేశారు. ప్రపంచంలోని అన్నిదేశాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి కల్పనే అతిపెద్ద సవాల్‌ అని అన్నారు.

ఈ విషయంలో రాష్ట్ర సర్కారు దూకుడుగా వ్యవహరించి ప్రైవేటు రంగంలోకి పెద్దఎత్తున పెట్టుబడులను ఆహ్వానించిందని తెలిపారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా అనేక పరిశ్రమలు వచ్చాయని, నాలుగున్నరేళ్లలో రెండు రెట్లు ఉపాధి అవకాశాలు కల్పించామని మంత్రి వివరించారు. ఉపాధి కల్పనే ధ్యేయంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్దపీట వేశామని తెలిపారు. తాము అధికారం చేపట్టాక రాష్ట్రంలో 4 లక్షల మంది బీడీ కార్మికులకు రూ.వెయ్యి పెన్షన్‌ అందిస్తున్నామని వివరించారు.

నిరుపేదలు ఏ కులంవారైనా పేదలే..
పేదలు ఏ కులంలోనైనా ఉన్నారని, పేరుకు అగ్రకులాలైనా వారిలో లక్షలాది మంది నిరుపేదలు ఉన్నారని కేటీఆర్‌ చెప్పారు. ఎవరు ఏ కులంలో పుట్టాలన్నది మన చేతుల్లో లేదని.. అగ్రకులాల్లోని నిరుపేదలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుపై కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అన్ని వర్గాల్లోని పేదల కష్టాలు తీర్చేలా తమ పార్టీ మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు