మళ్లీ ‘గ్రేటర్‌’ ఫలితాలే! 

24 Nov, 2018 05:23 IST|Sakshi
పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ పరిశ్రమల ప్రగతి సమావేశంలో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని మంత్రి కె. తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని భరోసా ఉండటంతోనే రాజకీయ సన్యాసంపై సవాల్‌ విసిరానని స్పష్టం చేశారు. ఈ సవాల్‌పై ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు ఇప్పటివరకు స్పందించలేదని, వారికి ఈ సవాల్‌ స్వీకరించే ధైర్యం లేదని విమర్శించారు. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్‌) ఆధ్వర్యంలో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి పేరుతో శుక్రవారం హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. డిసెంబర్‌ 11 తర్వాత రాహుల్‌ గాంధీ, చంద్రబాబు ఫిడేల్, వీణ వాయించుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చేది లేకున్నా పెద్ద ఎత్తున బిల్డప్‌ ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు పెట్టుకున్నప్పటికీ రాజకీయాల్లో వన్‌ ప్లస్‌ వన్‌ ఎప్పుడూ రెండు కాదని, పైస్థాయిలో నాయకులు కలిసినా క్షేత్రస్థాయిలో కలయిక ఉండదన్నారు. 

రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు... 
ఉద్యమ సమయంలో పత్రికలు కేసీఆర్‌ను భూతంగా చూపించాయని, దీంతో 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై కోపంతో హైదరాబాద్‌ ఓటర్లు టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించారని కేటీఆర్‌ గుర్తుచేసుకున్నారు. అయితే కేవలం 16 నెలల కాలంలోనే సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని గెలిచారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 సీట్లకుగాను టీఆర్‌ఎస్‌కు 99 సీట్లు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న పటిష్ట చర్యలు చూసి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏపీకి ఆప్షన్‌ ఇచ్చారని, ఆ తర్వాత కేసీఆర్‌ పనితీరుపట్ల ఆకర్షితులై తెలంగాణకు మార్చుకున్నారని కేటీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను సాకారం చేసే దిశగా కేసీఆర్‌ పటిష్ట ప్రణాళికలు రచించారన్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టి, అవగాహన, స్పష్టతగల వ్యక్తి అని, అందుకే ఆయనకు ఎకనామిక్స్‌ టైమ్స్‌ పత్రిక ఇటీవల బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం అందించిందని కేటీఆర్‌ తెలిపారు. 

మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాలి: టీఐఎఫ్‌ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి 
గత ప్రభుత్వాల హయాంలో కరెంట్‌ కోతల వల్ల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని టీఐఎఫ్‌ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్‌ కేవలం 6 నెలల్లోనే విద్యుత్‌ సమస్యను పరిష్కరించి పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని ప్రశంసించారు. పరిశ్రమలకు కావాల్సిన మినహాయింపులు, రాయితీలు, ప్రోత్సాహకాలను అడిగిన వెంటనే మంత్రి కేటీఆర్‌ మంజూరు చేస్తున్నారని కొనియాడారు. ఇకపై కూడా నిరంతర విద్యుత్‌ సరఫరాతో పాటు పరిశ్రమల సమస్యలను పరిష్కారానికి కృషి చేసే నాయకత్వం రాష్ట్రంలో ఉండాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, అలీప్‌ అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.  

టీఎస్‌–ఐపాస్‌ ద్వారా 8 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
అవినీతికి తావు లేకుండా పరిశ్రమలకు సత్వర అనుమతుల జారీకి తీసుకొచ్చిన టీఎస్‌–ఐపాస్‌ ద్వారా రూ. 1.40 లక్షల కోట్ల పెట్టుబడులు, 8 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని కేటీఆర్‌ వివరించారు. 1.12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించిందని, అందులో 87 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టగా, 38 వేల ఉద్యోగాల భర్తీ పూర్తయిందన్నారు. ప్రతిపక్షాలు ఏడాదిలోగానే లక్ష ఖాళీలు భర్తీ చేస్తామని హామీలిస్తున్నాయని, ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా వారికి తెలియదన్నారు. పారిశ్రామికవేత్తలకు రాయితీలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, కానీ రాయితీలు ఇవ్వడం వల్ల పరిశ్రమలొచ్చి ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. పరిశ్రమలకు బకాయిపడిన గత మూడేళ్ల రాయితీలను చెల్లిస్తామన్నారు. తాను చేసిన కృషి వల్లే ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్‌ కలిగి ఉందన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 

మరిన్ని వార్తలు