రాహుల్‌కు కేటీఆర్‌ కౌంటర్‌

20 Oct, 2018 20:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్‌ పేరు తొలగించారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్‌ తోసిపుచ్చారు. అంబేద్కర్‌ గురించి రాహుల్‌ తమకు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పీవీ నరసింహారావును కాంగ్రెస్‌ పార్టీ అవమానించిన తీరును ప్రజలు మర్చిపోలేదన్నారు. నిపుణుల సూచన మేరకే ప్రాజెక్టులను రీడిజైన్‌ చేస్తున్నట్టు చెప్పారు. రీడిజైన్‌తో నీటి నిల్వ సామర్థ్యం 160 టీఎంసీలకు పెంచామన్నారు. ప్రాజెక్టుల్ని అడ్డుకోవడానికే కాంగ్రెస్‌ కేసులు వేసిందని ఆరోపిం​చారు. 2013లో కాంగ్రెస్‌ తెచ్చిన భూసేకరణ చట్టం వల్లే ప్రాజెక్టుల ఖర్చులు పెరిగాయని వివరించారు.

తెలంగాణలో 24 గంటల కరెంట్‌ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కర్ణాటక తరహాలో రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, తెలంగాణ విధానాలనే కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తోందని వెల్లడించారు. లక్షా 9 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం రాహుల్‌కు తెలియదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్‌ను అడ్డుకున్నది కాంగ్రెస్సేనని, ముల్కీ నిబంధనలను అడ్డుకుని తెలంగాణకు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. మైనార్టీలను ఓటు బ్యాంకుగా కాంగ్రెస్‌ పరిగణిస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు