నిధులు రావాలంటే.. టీఆర్‌ఎస్‌ గెలవాలి 

2 Apr, 2019 03:52 IST|Sakshi
బాలాపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్‌

గులాబీ అభ్యర్థులు గెలిస్తే తెలంగాణకు లాభం: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు, పథకాలు, ప్రాజెక్టులు, హక్కులు పక్కాగా రావాలంటే కేంద్రంలో మన ఎంపీలు ఉండాలని, అందుకు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. సోమవారంరాత్రి ఇక్కడ బాలాపూర్‌ చౌరస్తాలో చేవెళ్ల టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డితో కలసి రోడ్‌షో నిర్వహించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలతో సీఎం కేసీఆర్‌కు సంబంధం లేదని కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయని, తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిస్తే రాహుల్‌గాంధీకి, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే మోదీకి లాభమని, టీఆర్‌ఎస్‌ గెలిస్తే తెలంగాణకు లాభం ఉంటుందన్నారు. మోదీ ఏదో చేస్తారని 2014 ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఐదేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఢిల్లీలో ఉంటే కేంద్రం మెడలు వంచి మనకు రావాల్సిన ని«ధులను రప్పించే శక్తి సీఎం కేసీఆర్‌కు ఉంటుందని స్పష్టం చేశారు.  

ఆదాయం పెరగాలి.. అభాగ్యులకు పంచాలి.. 
రాష్ట్ర ఆదాయం పెంచాలి... నిరుపేదలకు, అభాగ్యులకు పంచాలన్న సూత్రంతో కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకెళుతోందని, నిరంతర విద్యుత్, పెన్షన్లు, కల్యాణలక్ష్మితోపాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఇల్లులేని ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌రూం ఇల్లు అందజేసి సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలో 17 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నామని, అర్హులందరికీ ఇళ్లను కేటాయిస్తామన్నారు. వచ్చేనెల నుంచి 2 వేల పెన్షన్‌ను అందజేయనున్నట్లు తెలిపారు. కందుకూరు, మహేశ్వరం ప్రాంతాల్లో ఫార్మాసిటీతోపాటు పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు కానున్నాయని, నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహేశ్వరం, కందుకూరు మండలాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు.

ఈ ప్రాంతానికి సాగునీరు రావాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారానే సాధ్యమని, ఈ పథకం పూర్తి కావాలంటే కేంద్రంలో మన ఎంపీలు ఉండాలని, అప్పుడే ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందన్నారు. మీర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల ప్రక్షాళనకు రూ.23 కోట్లతో ట్రంకులైన్‌ ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే చెరువుల సుందరీకరణ జరుగుతుందన్నారు. ప్రజల దీవెన ఉంటే కేసీఆర్‌ మరో పదేళ్లు సీఎంగా ఉంటారని, నిరంతరం పేదల సంక్షేమాన్ని ఆకాంక్షించే నాయకుడు మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని కేటీఆర్‌ తెలిపారు. రోడ్‌షోలో చేవెళ్ల టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నాయకులు పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు