‘ఏపీ ప్రజలను గాలికొదిలేసి.. తెలంగాణలో ప్రచారం’

3 Dec, 2018 14:17 IST|Sakshi

సాక్షి, ఉట్నూర్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గడ్డం గీసుకోకుంటే తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆపద్దర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఖానాపూర్‌ నియోజకవర్గంలోని ఉట్నూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖా నాయక్‌ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాశనం చేసిన తెలంగాణను ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రజలను గాలికి వదిలేసి తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు టీఆర్‌ఎస్‌ మేలు చేసిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ 200 రూపాయల పెన్షన్‌ ఇస్తే.. టీఆర్‌ఎస్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 రూపాయలు ఇచ్చిందని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. 12 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్టు హామీ ఇచ్చారు. ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు గుంపులుగా వస్తున్నాయని విమర్శించారు. సంక్రాతికి ముందే గంగిరేద్దులా మహాకూటమి అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 3400 తాండాలు, గూడేలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ఒకప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడేవారని.. కానీ నేడు 35 శాతానికి పైగా ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఖానాపూర్‌ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. మిగతా పార్టీల బాసులు ఢిల్లీలో, అమరావతిలో ఉంటారని.. తమ బాసులు మాత్రం గల్లీల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు