దిగిపోయే ముందు దిక్కులేకే కొత్త పథకాలు

26 Mar, 2019 04:37 IST|Sakshi
సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన సభలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. సభకు హాజరైన జనం

‘రైతుబంధు’ను మోదీ, చంద్రబాబు కాపీ కొట్టారు

సిరిసిల్ల బహిరంగ సభలో కేటీఆర్‌

రాష్ట్రంలో సంక్షేమం.. కాంగ్రెస్, బీజేపీల్లో సంక్షోభం

రాహుల్, మోదీ కలిసినా అధికారంలోకి రాలేరు

సిరిసిల్ల: రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు పథకం తీసుకొస్తే ప్రధాని మోదీ, పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు కాపీ కొట్టారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు విమర్శించారు. దిగిపోయే ముందు దిక్కులేక రైతులకు మేలు చేసినట్లు నటిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం జరిగిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరి సంతోషంగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు సంక్షోభంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోదీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని, ప్రాంతీయ పార్టీలపైనే ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్, మాయావతి, ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఇలా దేశమంతా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోందని తెలిపారు.

మనం గెలిస్తేనే మన గడ్డకు లాభం...
రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటే ఢిల్లీని శాసించి నిధులు సాధిస్తామని కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కేసీఆర్‌ ఇప్పుడు దేశంలో నంబర్‌ వన్‌ సీఎంగా ఉన్నారన్నారు. ఢిల్లీకి గులాంగిరి చేయకుండా గులాబీ జెండాతో మన గల్లీ సత్తాను ఢిల్లీలో చాటిచెప్పాలన్నారు. కేసీఆర్‌ మొనగాడని.. రెండు ఎంపీ సీట్లతో తెలంగాణ సాధించిన ఆయన 16 మంది ఎంపీలతో ఏం చేస్తాడో ఎన్నికల తరువాత తెలుస్తుందన్నారు. కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నీ కలిసొస్తే కేంద్ర మంత్రిగా సేవలందిస్తారన్నారు. సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చేందుకు ఓట్ల సద్ది కట్టాలని కేటీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. సిరిసిల్ల నేతన్నలకు మరింత మేలు జరిగేలా రైల్వేలైన్‌ లాంటి పనులు పరుగులు తీస్తాయన్నారు. తెలంగాణ బీడు భూములకు నీళ్లు వస్తాయన్నారు.

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు...
గత ఐదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఎంతో ప్రయత్నించామని, కానీ దీనిపై ఎన్నిసార్లు ప్రధానిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం చేపట్టిన పోలవరానికి జాతీయ హోదా రావడంతో రూ. 50 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి తెచ్చుకొని ప్రాజెక్టు కట్టుకుంటున్నారన్నారు. 16 ఎంపీ సీట్లలో గెలిపిస్తే కేంద్రంలో కేసీఆర్‌ చక్రం తిప్పుతారన్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసే సత్తా ఉన్న నాయకుడు కేసీఆరే అన్నారు. రాష్ట్రంలో మే నుంచి ఆసరా పింఛన్‌ను రూ. 2 వేలు ఇస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తాయని, ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎవరు ఎగరేయాలో నిర్ణయించే ఎన్నికలు ఇవని కేటీఆర్‌ పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికలను ప్రజలు ఆషామాషీగా తీసుకోకుండా ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. సిరిసిల్ల ప్రాంతం నుంచి లక్ష మెజారిటీ ఇవ్వాలని, వినోద్‌ కుమార్‌ కంటే మంచి వ్యక్తి మనకు దొరకడని కేటీఆర్‌ అన్నారు.
రూ. 1,250 కోట్లతో నేతన్నలను

ఆదుకుంటున్నాం: మంత్రి ఈటల
సిరిసిల్ల ప్రజల బాధలు పోవాలని, కష్టాలు తీరాలని కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా రూ. 50 లక్షలు చందాలు సేకరించి ఇచ్చారని మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు కేవలం రూ. 70 కోట్లు ఉన్న చేనేత బడ్జెట్‌ ఇప్పుడు రూ. 1,250 కోట్లతో సిరిసిల్ల నేతన్నలను ఆదుకుంటున్నామన్నారు. అన్ని కులాలకు భరోసానిస్తూ బ్యాంకు రుణం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఈటెల చెప్పారు. సంకీర్ణ యుగంలో దేశ రాజకీయాలను టీఆర్‌ఎస్‌ ప్రభావితం చేస్తుందని, కేసీఆర్‌ దేశానికి స్ఫూర్తిప్రదాతగా నిలుస్తారని ఈటల పేర్కొన్నారు.

పెద్ద మనసుతో దీవించండి: వినోద్‌ కుమార్‌
సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌ కోసం ఎంతో కష్టపడ్డా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని ఎంపీ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాకు జాతీయ రహదారులను సాధించేందుకు కృషి చేశానని, సిరిసిల్లకు నవోదయ విద్యాలయం మంజూరైందన్నారు. సిరిసిల్ల ప్రజలు పెద్ద మనసుతో తనను దీవించాలని కోరారు. బహిరంగ సభలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, టీఆర్‌ఎస్‌ నాయకులు బసవరాజు సారయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామల పావనితోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఈద శంకర్‌రెడ్డి, ఆరేపల్లి మోహన్, ఆకునూరి శంకరయ్య, గగులోతు రేణ, దోర్నాల లక్ష్మారెడ్డి, దార్నం లక్ష్మీనారాయణ, గడ్డం నర్సయ్య, గూడూరి ప్రవీణ్, చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, చిక్కాల రామారావు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు