రాష్ట్రానికో తీరా?: కేటీఆర్‌

29 Mar, 2018 02:51 IST|Sakshi

బీజేపీ ఓ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అని మంత్రి ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లును బీజేపీ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మొన్నటిదాకా బీజేపీ మంత్రులున్న ఏపీలో.. ప్రైవేటు యూనివర్సిటీల్లో స్థానికులకు రిజర్వేషన్లు లేకుండానే బిల్లు తెచ్చారన్నారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో స్థానికులకు 25 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.

‘‘21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాల్లో ప్రైవేటు యూనివర్సిటీలు లేవా? జాతీయ పార్టీ అంటే రాష్ట్రానికో వైఖరితో వ్యవహరిస్తుందా?ఇలాంటి బీజేపీ జాతీయ పార్టీ కాదు. ఒక పెద్ద సైజ్‌ ప్రాంతీయ పార్టీ. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడాన్ని ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లుకు ముడి పెట్టడం హాస్యాస్పదం.

ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల కోసం టీఆర్‌ఎస్‌ పోరాడటం లేదు. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం. ఇది తెలుసుకోకుండా, అవగాహన లేకుండా రాష్ట్ర బీజేపీ మాట్లాడుతోంది’’అని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు వస్తే ఉన్నత ప్రమాణాలున్న విద్యే కాకుండా ఉపాధి అవకాశాలూ మెరుగుపడతాయన్నారు. బీజేపీ నేతలు గుడ్డి విమర్శలు మానుకొని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. 

మరిన్ని వార్తలు