ప్రశంసలే తప్ప పైసల్లేవు

6 Jan, 2019 00:38 IST|Sakshi

కేంద్రానిది వివక్షపూరిత వైఖరి

తెలంగాణకు అన్యాయం చేస్తోంది

కేంద్రంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌  ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణపై బీజేపీ వివక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్న కేంద్రం.. మన రాష్ట్రానికి సాయం చేసేందుకు మాత్రం చేతులు రావట్లేదని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మాట్లాడారు. ‘మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధుల కేటాయింపుపై మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో ఇటీవల ప్రశ్నించారు. దేశంలోని అన్ని ప్రతిష్టాత్మక సంస్థలు, వ్యక్తులు ప్రశంసిస్తున్న ఈ పథకాలకు ఇప్పటిౖకైనా నిధులు కేటాయిస్తారా అని అడిగారు. ఈ రెండు పథకాలకు నిధుల కేటాయింపు ప్రతిపాదనను తిరస్కరించినట్లు కేంద్ర జలవనరుల సహాయ మంత్రి అర్జున్‌ మేఘవాల్‌ సమాధానమిచ్చారు. మిషన్‌ భగీరథ పథకానికి రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ప్రతిపాదించింది. ప్రధాని నిర్వహించే మన్‌కీ బాత్‌లోనూ మిషన్‌ భగీరథ అనుసరణీయ పథకమని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఈ పథకం అమలుపై అధ్యయనం చేస్తున్నాయి. ప్రధాని మోదీ గజ్వేల్‌కు వచ్చి మిషన్‌భగీరథను ప్రారంభించారు. ఇలా అందరూ బాగుందని మెచ్చుకుంటున్నా.. కేంద్రం మాత్రం ప్రశంసలు తప్ప పైసలు ఇవ్వట్లేదు. కేంద్రం ఛండాలమైన వ్యవహారాల వల్ల వంద సీట్లలో డిపాజిట్‌ కోల్పోతుందని నేను చెప్పా. ప్రజలు ఏకంగా 103 సీట్లలో బీజేపీకి డిపాజిట్‌ రాకుండా చేశారు. ఇప్పటికైనా బీజేపీ తీరు మార్చుకోవాలని వినయపూర్వకంగా హెచ్చరిస్తున్నా. బీజేపీ తీరు ఇలాగే ఉంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లలోనూ డిపాజిట్‌ గల్లంతవుతుంది. మొద్దు నిద్ర, మొండి నిద్ర నుంచి బీజేపీ మేల్కోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారు.

కాంగ్రెస్‌లో సంక్షోభం..
టీఆర్‌ఎస్‌ వ్యవహారాల్లో అన్ని నిర్ణయాలు పార్టీ అధినేత కేసీఆర్‌ తీసుకుంటారని.. ఆ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత తనదని కేటీఆర్‌ అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై ప్రత్యర్థులు అన్ని రకాలుగా దాడి చేశారు. రకరకాల విమర్శలతో కొన్ని వర్గాలు టీఆర్‌ఎస్‌కు దూరమయ్యాయి. అలాంటి వర్గాలు సైతం లోక్‌సభ ఎన్నికల్లో మాతోనే కలుస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు వస్తాయి. కాంగ్రెస్‌ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. ఆ పార్టీకి అభ్యర్థుల కొరత ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమయ్యారు. ములుగు అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్‌ ఓడిపోయినా ఆ జిల్లా ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. 80 ఎంపీ సీట్లు ఉండే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఏమీ ఉండదు. ఎస్పీ, బీఎస్పీ కలిస్తే వారిదే ఆధిక్యత ఉంటుంది. మన రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలకపాత్ర పోషిస్తుంది. సీఎం కేసీఆర్‌ ఎంపీగా ఎందుకు పోటీ చేస్తారు? ఇవన్నీ ఎవరో చేసే ప్రచారాలే. కోదండరాంను మీడియానే నాయకుడిని చేసింది.ఆయనతో ఏమీ కాదని నేను ముందే చెప్పా. లోక్‌సభ ఎన్నికల్లోనూ కూటమి ఉంటే మొన్న ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ సీటు ఇచ్చినట్లుగా టీజేఎస్‌కు హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం ఇస్తారనుకుంటా.ఏపీ రాజకీయాలను ఆ రాష్ట్రానికి వెళ్లి చేయాలనే లేదు. ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు నవ్వు పుట్టిస్తున్నాయి. ఆఖరికి గడియారాలపైనా రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇంకా ఈవీఎం గురించి మాట్లాడుతున్నారు. ప్రజల తీర్పుతో అందరికీ స్పష్టత వచ్చింది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌ను ఆధునీకరిస్తాం. పార్టీలోని ప్రతి విభాగానికి ఓ గది కేటాయిస్తాం. మీడియా ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఏర్పాటవుతుంది’ అని అన్నారు.

కేంద్రంలో ఉలుకే లేదు..
ప్రధాని గజ్వేల్‌కు వచ్చి నప్పుడు పాలమూరు, కాళేశ్వరం, రాష్ట్రం లోని మరేదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ కోరారు. దీనిపై కేంద్రంలో ఇప్పటికీ ఉలుకూ లేదు.. పలుకూలేదు. జీఎస్టీ బకాయిలు, కంపా నిధు లు, ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ, ఉమ్మడి రాష్ట్ర విభజన హామీల విషయంలోనూ ఇలాగే ఉంది. కేం ద్రం బాధ్యతలు విస్మరించినా ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంచాం. బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధాని అన్నట్లు మోదీ వ్యవహరిస్తున్నారు. ఏపీలో పోలవరానికి 95 శాతం నిధులిస్తున్న కేంద్రం కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వట్లేదు.బయ్యారంలో ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్రం వైఖరి స్పష్టం చేసే దాకా వేచి చూస్తాం’ అని అన్నారు.  

మరిన్ని వార్తలు