అది జఫ్ఫా కూటమి

7 Oct, 2018 01:50 IST|Sakshi

టీఆర్‌ఎస్‌వీ సమావేశంలో కేటీఆర్‌ ధ్వజం

కాంగ్రెస్‌ వారికి బలుపెక్కువ... హామీల అమలులో వారు లంగలు

ప్రగతిభవన్‌ బద్దలు కొట్టుడేమోకానీ, కనీసం గోడలు గీకే పరిస్థితి లేదు

ఇంకొకడు వాంతి చేసుకుంటే ఉత్తమ్‌ మంత్రి అయ్యిండు

ఢిల్లీ బలుపుకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోటీ

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వంద సీట్లలో గెలుస్తుందని పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు రాహుల్‌గాంధీ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ అని అన్నారు. టీఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణను కాపాడుతుందని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘చింత చచ్చినా పులుపు జల్ది జావదు. వాళ్ల బలుపు అంతకంటే చావదు. కాంగ్రెసోళ్లకు కొద్దిగ అది ఎక్కువ. నేను సైనికుడినని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డైలాగులు చెబుతాండు. నువ్వు సైనికుడివి ఎప్పుడైనవు. నేను గట్టిగ మాట్లాడితే రేపు కాంగ్రెసోళ్లు నన్ను బచ్చాగాడు అంటరు.

ఈ బచ్చాగాళ్లే (విద్యార్థులు) కదా తెలంగాణను తీసుకువచ్చింది. వీళ్లు ఉద్యమంలో పాల్గొన్న నాడు మంత్రులుగా మీరు ఇళ్లల్లో పన్నరు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో వీర సైనికులుగా పోరాటం చేస్తుంటే ఇంట్లో పడుకున్న నువ్వు సైనికుడివి ఎట్లయితవు. మంత్రి పదవి కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి కాళ్లు పట్టుకున్నవు. ఇంకొకడు వాంతి చేసుకుంటే మంత్రి అయినోడు ఉత్తమ్‌. ఆయన నేను పోటుగాన్ని, సైనికుడినని అంటడు. నువ్వు సైనికుడివికాదు. బంట్రోతువి. ప్రెసిడెంట్‌ వెనుక దాక్కున్నోడివి. మాకు తెల్వదా. ఉద్యమ సమయంలో హౌసింగ్‌ కుంభకోణంలో, కోదాడకు వాహనాల్లో డబ్బులు పంపుకోవడంలో బిజీగా ఉన్నావు.

తెలంగాణను సాధించిన ఈ బచ్చాగాళ్లే రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెబుతారు. వచ్చే ఎన్నికలు కుటుంబానికి, ప్రజలకు మధ్య పోటీ అని భట్టి విక్రమార్క అంటుండు. ఇది వాస్తవమే. అయితే రాహుల్‌గాంధీ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోటీ ఇది. 67 ఏళ్లు  నరకం చూపెట్టిన కాంగ్రెస్, టీడీపీలను వాయిల్‌ కట్టెతో ఇయ్యరమయ్యర కొట్టే అవకాశం వచ్చింది. రెండు పార్టీలనే కాదు 4 పార్టీలు. ఒక్క దెబ్బకు 4 పిట్టలను కొట్టే అవకాశం వచ్చింది. అది మహాకూటమి కాదు. జఫ్ఫా కూటమి. నలుగురు బఫూన్లు... వారి అదిపెద్ద బఫూన్‌ రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో పెట్టుకున్న కూటమి. పొరపాటున వాళ్లు అధికారంలోకి వస్తే 3 నెలలకు ఒకరు చొప్పున సీఎం సీటును పంచుకుంటరు.

ఒక్కో జిల్లాకు ఐదుగురు సీఎం అభ్యర్థులున్నారు. సీల్డ్‌ కవర్‌ సీఎం కావాల్నా?, తెలంగాణ మట్టిలో నుంచి వచ్చిన సీఎం కేసీఆర్‌ కావాల్నా తేల్చుకోవాలి’అని అన్నారు. ‘ఉత్తరకుమార్‌రెడ్డి డైలాగులు చూస్తే పెన్షన్‌ 2 వేలు, అల్లం, బెల్లం ఇస్తమన్నరు. మోచేతికి బెల్లం పెడతం. ఆ తర్వాత నాకాలి అంటున్నరు. ఉత్తమ్‌ సోయి ఉండి మాట్లాడుతున్నరో లేదో.. పెళ్లికాని వారికి అమ్మాయిలను చూస్తామంటరు. ఇళ్లళ్లకు వచ్చి మూడుపూటలా వంట చేస్తమంటరు. పిల్లలు పుడితే డైపర్లు మారుస్తామంటరు. పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేయవచ్చా.. అని ఆర్థికవేత్తలను అడిగితే ఆరు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్‌ సరిపోదని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు తులం బంగారం ఇస్తమంటరు. లంగలు వాళ్లు. గుడినికాదు గుడిలో లింగాన్ని మింగుతారు’అని కేటీఆర్‌ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

పొత్తుల ప్రాతిపదిక ఏమిటి?
‘కాంగ్రెస్, టీడీపీలతో మీరు పొత్తు పెట్టుకోలేదా అంటున్నరు. 2004లో సోనియాగాంధీ తెలంగాణ గడ్డకు వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇస్తమని చెబితే పొత్తుపెట్టుకున్నం. చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించి 2009తో పొత్తు పెట్టుకున్నం. తెలంగాణ కోసం ఒక్కో పార్టీని ఒప్పించే క్రమంలో ఒక్కో ఎన్నికను ఒక్కో మెట్టుగా వాడుకున్నాం. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలే ఎజెండాగా వాళ్ల కూటమి ఉంటదని కోదండరాం సార్‌ అంటరు.

మమ్మల్ని చంపి అమరవీరులను చేసిన కాంగ్రెస్‌తో, హంతక టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఏ అమరవీరుడి కుటుంబం మిమ్మల్ని అడిగిందని నేను కోదండరాం సార్‌ను అడిగిన. ఇప్పటి దాకా నోరు మెదడంలేదు. 119 స్థానాల్లో పోటీ చేస్తాం. ప్రగతిభవన్‌ గోడలు బద్దలు కొడతామని ప్రకటించారు. బద్దలు కొట్టుడేమోగానీ కనీసం గోడలు గీకే పరిస్థితే లేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతి దగ్గర పెడితే ఎలా న్యాయం జరుగుతుందో కోదండరాం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పాలి. 4 సీట్ల కోసమే కదా పంచాయితీ అంటే ఎగిరెగిరి పడ్డరు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం ముందు ఈ పౌరుషం ఏమైంది’అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు