స్కాంగ్రెస్‌ మట్టికరువక తప్పదు: కేటీఆర్‌

12 Mar, 2018 15:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని స్కాంగ్రెస్‌ పార్టీగా అభివర్ణిస్తూ.. ఘాటైన విమర్శలు ఆయన ఎక్కుపెట్టారు. ‘స్కాంగ్రెస్‌ పార్టీకి చర్చించేందుకు సబ్జెట్‌కు లేదు. కనీసం హుందాగా అసమ్మతి తెలిపే నైతిక అధికారం కూడా లేదు. స్కాంగ్రెస్‌ విఫల ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు చూసి, విసిగిపోయి, ఆ పార్టీని చెత్తకుప్పలో విసిరేశారు. ఆ పార్టీ ఎంత రౌడీయిజానికి దిగినా.. మట్టికరువక తప్పదు’ అంటూ కేటీఆర్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు.

బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో సోమవారం తీవ్ర ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో విపక్ష కాంగ్రెస్‌ సభ్యుల్లో కొందరు దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన హెడ్‌సెట్‌ను విసిరికొట్టడంతో.. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి స్వల్ప గాయమైంది. కోమటిరెడ్డి హెడ్‌సెట్‌ విసిరేసిన దృశ్యాలు అసెంబ్లీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అసెంబ్లీలో తాజా పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, కాంగ్రెస్‌ సభ్యులపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు