రైతు ఆత్మహత్యలకు మీరే కారణం

21 Oct, 2018 00:47 IST|Sakshi

కాంగ్రెస్‌ చరిత్రేంటో ప్రజలకు తెలుసు

మీది ధనయజ్ఞం.. మా హయాంలో సస్యశ్యామలం

అసత్యాలు, అర్థసత్యాలతో ప్రసంగించొద్దు

రాహుల్‌పై కేటీఆర్‌ ఫైర్‌  

సాక్షి, హైదరాబాద్‌ : దేశాన్ని యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీకి జాతీయాధ్యక్షుడైన రాహుల్‌గాంధీ రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడటం సిగ్గుపడాల్సిన విషయమని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాల అసమర్థతే కారణమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుతున్నాయంటూ.. కేంద్ర నివేదికలు వెల్లడించిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. భైంసా, కామారెడ్డిల్లో రాహుల్‌ ప్రసంగమంతా అర్థ సత్యాలు, అసత్యాలతో కొనసాగిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ పాలనలో నాలుగేళ్లలో 25 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, టీఆర్‌ఎస్‌ హయాంలో పాలమూరు పచ్చగా.. రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారుతోందని వెల్లడించారు. ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎం.శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్‌ శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘రాహుల్‌గాంధీ అసత్యాలు, అర్ధసత్యాలు మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని చూసుకోకుండా చదివారు. కాంగ్రెస్‌ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ అనే వృద్ధ జంబూకం తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాహుల్‌గాంధీ ప్రసంగంలో రెండు పూర్తి అబద్ధాలు చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ఉన్న అంబేద్కర్‌ పేరును మార్చామని చెప్పారు. ఆ ప్రాజెక్టు కొనసాగుతోందనే విషయం ఆయనకు తెలియదనుకుంటా. రాహుల్‌ ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.  
 
మీరా అంబేద్కర్‌ గురించి మాట్లాడేది? 
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. ‘పెద్దలను గౌరవించే సంస్కారం కాంగ్రెస్‌కు లేదు. చనిపోయిన 34 ఏళ్ల తర్వాత వీపీసింగ్‌ ప్రభుత్వం అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చింది. రాహుల్‌గాంధీ విజ్ఞతతో మాట్లాడాలి. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీ నర్సింహారావును అగౌరవపరిచింది. పీవీ నర్సింహారావు మృతదేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలోకి సైతం రానివ్వకుండా హైదరాబాద్‌కు పంపించింది. సొంతపార్టీ వారినే ఆ పార్టీ గౌరవించదు. మేం మాత్రం పీవీ నర్సింహారావు, కాకా, ఈశ్వరీబాయి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, జయశంకర్‌లను గౌరవించుకున్నాం. కుమ్రంభీం గురించి రాహుల్‌గాంధీ మొదటిసారి తలుచుకున్నారు. మేం ఆయన పేరును ఓ జిల్లాకు పెట్టాం. రాజకీయాల కోసం చిల్లర మాటలు, కుసంస్కారం వద్దు’అని మంత్రి మండిపడ్డారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం విషయంలోనూ రాహుల్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. ‘రూ.35 వేల కోట్ల ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాహుల్‌ మాట్లాడొద్దు. 2007లో ఈ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో ప్రారంభించాలని నిర్ణయించింది. తొలి ఏడాదిలోనే రూ.38 వేల కోట్లకు పెంచింది. 2010లో రూ.40 వేల కోట్లుగా నిర్ధారించింది. దీన్ని మేం ధనయజ్ఞమని విమర్శించవచ్చు. అప్పటి అంచనాల ప్రకారం.. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కేవలం 16 టీఎంసీలు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్, సాగునీటి నిపుణులతో చర్చించి ఇదే ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 160 టీఎంసీలకు పెంచారు. అదనంగా మూడు బ్యారేజీలు, పంపుహౌజులు నిర్మిస్తున్నాం. కేంద్ర జలవనరుల సంఘం రూ.80 వేల కోట్లకు అనుమతిచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంతోనే అంచనా పెరిగింది. అప్పుడు ఎకరానికి రూ.2 లక్షల వరకున్న పరిహారం ఇప్పుడు రూ.12 లక్షలకు చేరింది. ఈ విషయాలు రాహుల్‌గాంధీకి తెలియవా? కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్, కర్ణాటకలో 2010 ధరలే ఇప్పుడూ ఇస్తున్నారా? అవినీతి జరిగిందనే విమర్శలు సరికాదు’అని కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. 
 
రైతు ఆత్మహత్యలు తగ్గాయ్‌! 
రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడేందుకు రాహుల్‌ సిగ్గుపడాలన్నారు. ‘యాభై ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ అసమర్ధత వల్లే ఇప్పుడీ పరిస్థితులు ఏర్పడిన మాట వాస్తవం కాదా? ఎస్సారెస్పీ ప్రాజెక్టు పనులు మీ ముత్తాతల హయాంలో మొదలయ్యాయి. మొన్నటి వరకు పూర్తి చేయలేదు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. 2014లో 1340 ఆతహత్యలు జరిగితే.. 2016లో 645కు తగ్గాయని కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయంలో వ్యవసాయం పురోగమిస్తోంది. సాగుకు కావాల్సిన కరెంటు, సాగునీరు, పెట్టుబడి సాయంలో అందించే విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం ముందుంది. మా ప్రభుత్వం 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తోంది. మీరు 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తొమ్మిది గంటలు ఇస్తామని చెప్పి ఆరు గంటలు కూడా ఇవ్వలేదు. కర్ణాటక తరహాలో రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణలో చేసినట్లుగానే కర్ణాటకలో చేస్తున్నారు’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 
 
32వేల ఉద్యోగాల భర్తీ 
ఉద్యోగాల విషయంలో రాహుల్‌గాంధీ అసత్యాలు మాట్లాడారని కేటీఆర్‌ మండిపడ్డారు. నాలుగేళ్లలో తమ ప్రభుత్వం 32 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. 1.09 లక్షల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినివ్వగా.. 87 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ‘ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్‌ సైంధవపాత్ర పోషించింది. కాంట్రాక్టు పోస్టులను రెగ్యులర్‌ చేయకుండా కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టించింది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా చనిపోయిన వాళ్ల పేర్లతో తప్పుడు వేలిముద్రలతో పిటిషన్లు వేసింది. కాంగ్రెస్‌ ఎప్పుడూ హిందూ, ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసింది. రాహుల్‌ చార్మినార్‌ దగ్గర ఏదేదో మాట్లాడారు. ప్రజలను మతాల వారీగా విభజించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ హయంలో కర్ఫ్యూ సాధారణంగా జరిగేది. కాంగ్రెస్‌ అంటేనే కర్ఫ్యూ అనే పేరు పడిపోయింది. రోశయ్య హయాంలోనూ ఇదే జరిగింది. మా ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ విధించలేదు. మైనారిటీ సంక్షేమం విషయంలో కేసీఆర్‌ పాలనకు తిరుగులేదు. మోదీతో కేసీఆర్‌ కలిసిపోయారని రాహుల్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ విషయంలో రాహుల్‌ అయినా.. మోదీ అయినే ఒక్కటే. వీరిద్దరూ మనకు అన్యాయం చేసినవారే. కాంగ్రెస్, బీజేపీ ఒకే తాను ముక్కలు. టీఆర్‌ఎస్‌ పాలనలోనే మతసామరస్యం కొనసాగుతుంది. మైనారిటీలకు స్వయం ఉపాధి కలుగుతుంది. రాష్ట్రంలో బీజేపీ ఉనికే లేదు. వందకుపైగా స్థానాల్లో ఆ పార్టీకి డిజిపాట్‌ దక్కదు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీయే ప్రత్యర్థి. రాహుల్‌గాంధీ జాగ్రత్తగా మాట్లాడాలి’అని కేటీఆర్‌ హెచ్చరించారు.  
 

మరిన్ని వార్తలు