కాంగ్రెసోళ్లు లుచ్చాగాళ్లు..!

16 Aug, 2018 04:10 IST|Sakshi
ఎలగందుల సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

రాహుల్‌ అడుగుపెట్టిన చోటల్లా కాంగ్రెస్‌ ఖతం

మున్సిపాలిటీని గెలిపించే సత్తాలేని నేత అని ఎద్దేవా 

ప్రాజెక్టుల రీడిజైన్‌ను విమర్శించే హక్కు రాహుల్‌కు లేదు

కరీంనగర్‌ సభలో మంత్రి కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కాంగ్రెసోళ్లు లుచ్చగాళ్లంటూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఫైర్‌ అయ్యారు. కరీంనగర్‌లో రూ.231 కోట్లతో చేపడుతున్న స్మార్ట్‌సిటీ రోడ్ల పనులను, రూ.5కే భోజనం పథకాన్ని, కోర్టు జంక్షన్‌లో అందంగా రూపొందించిన కూడలిని బుధవారం ప్రారంభించారు. అనంతరం సర్కస్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలపై కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోకి కొత్త బిచ్చగాళ్లొచ్చారంటూ.. సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చి నట్లు ఎన్నికలు దగ్గర పడుతుండగానే ఢిల్లీ నుంచి ఇక్కడికొచ్చారని విమర్శించారు. గంగిరెద్దులోళ్లు మంచోళ్లంటూనే.. కాంగ్రెసోళ్లు లుచ్చాగాళ్లంటూ మండిపడ్డారు. నాలుగేళ్లుగా గ్రామాల్లో మొఖం చూపలేని.. తెలివిలేని దద్దమ్మలు ఇప్పుడొచ్చి ‘తిమ్మి ని బమ్మిని’చేసే మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వ లేని కాంగ్రెస్‌ నేతలు ప్రజలపై కపట ప్రేమను ఒలక బోస్తున్నారని దుయ్యబట్టారు.  

రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ఖతం..  
సొంత నియోజకవర్గంలోని అమేథీ మున్సిపాలిటీని గెలిపించుకోలేని రాహుల్‌ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తాడంటే హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. బీఎస్పీ, సమాజ్‌వాది దయ తో గెలిచిన రాహుల్‌.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్‌ భూస్థాపితమవుతోందని విమర్శించారు. అందుకు కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ మాదిరిగానే తెలంగాణలో సైతం కాంగ్రెస్‌ ఖతమవుతుందని కేటీఆర్‌ జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో రాహుల్‌ శిష్య బృందానికి శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్‌ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

కరెప్షన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌  
కాంగ్రెస్‌ పార్టీ కరెప్షన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అని.. అలాం టి వారు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్‌ అన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ అంటేనే దోపిడీ అంటూ రాహుల్‌ తిమ్మిని బమ్మిని చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వాళ్లు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారని, 60 ఏళ్లు దగాపడ్డ తెలంగాణకు మాత్రం ఏమీ ఇవ్వ మని చెప్పకనే చెబుతున్నారని విమర్శించారు. ఒక్క రిజర్వాయర్‌ లేకుండా 160 టీఎంసీల నీటిని కేవలం పంపింగ్‌ ద్వారా ఎత్తిపోయడం సాధ్యం కాదని, నీటి నిలువ సామర్థ్యం పెంచితే, కరువు సమయంలో కూడా నీళ్లను అందించేలా రీడిజైన్‌లు చేపట్టామని వివరించారు. రాహుల్‌ గన్‌పార్కుకు వెళ్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడం విడ్డూరంగా ఉందన్నారు. 1969 ఉద్యమంలో ఇందిరాగాంధీ హయాంలో 369 మందిని చంపిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. గన్‌పార్కు ఎందుకు కట్టారో కూడా రాహుల్‌కు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు.  
అభివృద్ధి చేసి చూపించాం: ఈటల
56 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించామని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కురుచ పార్టీల నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలకు టీఆర్‌ఎస్‌పై ప్రేమ ఆశీర్వాదం ఉందని, కాం గ్రెస్‌ వాళ్ల కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

తొలి బీమా ప్రయోజనం
సిరిసిల్ల జిల్లాలో రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేత
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకంలో తొలి ప్రయోజనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇద్దరు రైతుల కుటుంబాలకు దక్కింది. జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో మంత్రి కేటీఆర్‌ రెండ్రోజుల క్రితం మృతి చెందిన కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన జాప పోషయ్య (50), చందుర్తి మండలం మూడపల్లికి చెందిన రాచర్ల బూదమ్మ(42) కుటుంబ సభ్యులకు ప్రొసీడింగ్‌ కాపీలు అందించారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే ప్రీమి యం చెల్లించి బీమా చేయించిందని కేటీఆర్‌  తెలిపారు. రైతు చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ఎల్‌ఐసీ ద్వారా ఇప్పిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు చనిపోయిన 24 గంటల్లోగా బీమా సాయాన్ని అందించడం రాష్ట్రంలో తొలిసారి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు