మీట్‌ ది ప్రెస్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

16 Dec, 2018 01:44 IST|Sakshi

పార్టీని అలా మారుస్తాం

కేసీఆర్‌ నాయకత్వం దేశానికి అవసరమనే రీతిలో బలోపేతం చేస్తాం

కాంగ్రెస్‌ నేతలు ఇంకా మాయలోనే ఉన్నారు

వారసులైనా రాజకీయాల్లో నిరూపించుకోవాలి

ఎన్నికల తర్వాత ఏపీలోనూ టీడీపీ నామమాత్రమే

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)ని తిరుగులేని రాజకీయ శక్తిగా మారుస్తానని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. దేశ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించేలా టీఆర్‌ఎస్‌ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో గెలిచిన తాము మరో ఆరు నెలల్లో జరగనున్న వరుస ఎన్నికల పోరాటాలనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో తాను ఉండాలా లేదా అనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణకు మరో 10–15 ఏళ్లు కేసీఆరే సీఎంగా ఉండాలని తనతోపాటు టీఆర్‌ఎస్‌లోని అందరూ కోరుకుంటున్నారన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌ వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే...

టీఆర్‌ఎస్‌కు 98 లక్షల మంది మద్దతు...
స్వీయ రాజకీయ అస్తిత్వంతోనే తెలంగాణ ప్రయోజనాలు, ప్రజలు ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అనేవారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే పార్టీగా ప్రజలు టీఆర్‌ఎస్‌ను గుర్తించారు. రాష్ట్రంలో ఓటు వేసిన 2 కోట్ల మందిలో టీఆర్‌ఎస్‌కు 98 లక్షల మంది మద్దతు పలికారు. మా తర్వాత రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు కేవలం 42 లక్షల మంది మాత్రమే ఓటు వేశారు. వారికి, మాకు ఓట్లలో తేడా 28 శాతం ఉంది. పల్లె, పట్నం, గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతాలు, వర్గాలతో సంబంధం లేకుండా అందరూ టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సహా ఎందరో బీజేపీ ప్రముఖులు తెలంగాణలో ప్రచారం చేశారు. అయినా మేము ముందుగా చెప్పినట్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి 103 సీట్లలో డిపాజిట్‌ రాకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం వస్తుందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ గూబ గుయ్‌మనేలా శబ్ధ విప్లవమే వస్తుందని చెప్పా. రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్లలో 80 శాతం టీఆర్‌ఎస్‌కు వచ్చాయి.

ప్రతి హామీ అమలు చేస్తాం...
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని తూ.చ. తప్పకుండా అమలు చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిస్థాయిలో పాలన, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్మాణంపై దృష్టి పెట్టేందుకు నన్ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. 2006 నుంచి టీఆర్‌ఎస్‌లో పని చేస్తున్నా. ప్రత్యక్షంగా నాలుగు ఎన్నికలు సహా మొత్తం ఎనిమిది ఎన్నికల్లో ఉన్నా. అన్నింటినీ అర్థం చేసుకొని టీఆర్‌ఎస్‌ను బూత్, గ్రామ, మండల స్థాయి నుంచి సంస్థాగతంగా పటిష్ట పరుస్తాం. టీఆర్‌ఎస్‌ వందేళ్లపాటు పటిష్టంగా ఉండేలా మార్చే లక్ష్యంతో పని చేస్తాం. రాబోయే 6–7 నెలల్లో జరగనున్న గ్రామ పంచాయతీ, సహకార, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంగా ముందుకెళ్తాం.

కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం...
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 150–160 సీట్లకే పరిమితవుతుంది. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లోకంటే రెట్టింపు సీట్లొచ్చినా ఆ సంఖ్య 90 దాటదు. సంకీర్ణ ప్రభుత్వాలే అనివార్యమనే పరిస్థితి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు వస్తే దేశ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఆధారంగా చూస్తే తెలంగాణలో ఒక్క ఖమ్మం మినహా 15 లోక్‌సభ సీట్లలో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను 16 సీట్లలో గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తాం. దేశ స్థాయిలో నిర్మాణాత్మకంగా వ్యవహరించవచ్చు. తెలంగాణలో అమలు చేసే రైతు బంధు, రైతు బీమా, మిషన్‌ భగీరథ దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది. మిషన్‌ భగీరథకు కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు తీసుకురావచ్చు. బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబంధంలేని సమాఖ్య వ్యవస్థ బలపడే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలి. ఇక్కడి పథకాలను దేశమంతటా అమలు చేస్తే దేశం అబ్బురపడుతుంది.  

దేశానికి కేసీఆర్‌ నాయకత్వం...
రాష్ట్రంలో ఎప్పుడూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది. టీఆర్‌ఎస్‌ విషయంలో మాత్రం ప్రభుత్వ సానుకూల ఓటు పెరిగింది. మాకు ప్రగతిశీల, అభివృద్ధి ఓటు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్‌ పాలనకు రెఫరెండమని నేను ముందే చెప్పినట్లుగానే ప్రజలు తీర్పిచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌కు ఈసారి 5 శాతం ఓటింగ్‌ పెరిగింది. టీఆర్‌ఎస్‌ బలంగా ఉంది కాబట్టే అన్ని ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా పార్టీని బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేస్తాం. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు... తిరుగులేని రాజకీయ శక్తి అనేలా మారుస్తాం. కేసీఆర్‌ నాయకత్వం దేశానికి అవసరమనే రీతిలో ఉండేలా పార్టీని బలోపేతం చేస్తాం. సర్పంచ్‌ నుంచి ఎంపీ ఎన్నికల వరకు అన్నింట్లోనూ స్థాయిని బట్టి టీఆర్‌ఎస్‌ శ్రేణులకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తాం. మా పార్టీలోనే విద్యార్థి నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, డాక్టర్లు... ఇలా అందరికీ అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చాం. ఎక్కువ మంది గెలిచారు. పార్టీలో మహిళల ప్రాధాన్యం పెంచుతాం.

ఆ పత్రికలు, టీవీలు ఏదో జరుగుతోందన్నట్లు చూపాయి...
కొన్ని పార్టీలు ప్రజాకూటమి పేరుతో ప్రజలులేని కూటమి కట్టాయి. లేనిది ఉన్నట్లు చూపే ప్రయత్నం చేశాయి. రెండు, మూడు పత్రికలు, టీవీలు ఏదో జరుగుతున్నట్లు చూపాయి. ఏదో పోతులూరి తరహాలో జరగబోయేది ఇదే అని చెప్పే ప్రయత్నం చేశాయి. మేం అలాంటి మాయాలో పడలేదు. కాంగ్రెస్‌ వాళ్లు ఆ మాయలోపడ్డారు. అందుకే ఇంకా ఓటమి నుంచి తేరుకోవట్లేదు. ఓటమిని సమీక్షించుకోకుండా ఇప్పుడు ఈవీఎంలపై పడ్డారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ గెలిచిందనే ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండకూదని ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు పత్రికలు, మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. లగడపాటి రాజగోపాల్‌ తెలంగాణ ఉద్యమ దెబ్బకు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు సర్వే సన్యాసం తీసుకున్నారు.

వారుసులైనా నిరూపించుకోవాలి....
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమారుడిగానే నాకు మొదట అవకాశం వచ్చింది. 2006 నుంచి నేను ఉద్యమంలో పాల్గొన్నా. 2009లో సిరిసిల్లలో స్వల్ప మెజారిటీతో గెలిచా. ఆ తర్వాత నుంచి నాకు ప్రజామద్దతు పెరుగుతూ వస్తోంది. పార్టీ అవకాశాలు ఇస్తుంది. దాన్ని నిరూపించుకుంటేనే కొనసాగిస్తుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు ఇక్కడ ఏమీ లేదు. అయినా భారీ ఆధిక్యంతో సీట్లు గెలుచుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 29 స్థానాల్లో 18 గెలుచుకున్నాం. పార్టీలో అవకాశాలు సీనియారిటీ ప్రకారం అనేది ఏమీ ఉండదు. నేను ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలా లేదా అనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టం. మంత్రివర్గ ఏర్పాటు పూర్తిగా సీఎం అభీష్టం మేరకు ఉంటుంది. ప్రభుత్వంలో మహిళలు ఉండే విషయంలోనూ సీఎందే తుది నిర్ణయం. తెలంగాణ రాష్ట్రానికి మరో 10–15 ఏళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలి. నాతోపాటు మా పార్టీలోని అందరిదీ ఇదే మాట. హైదరాబాద్‌ నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించవచ్చు. గతంలో ఎన్టీఆర్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉంటూనే నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా, పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కీలక పాత్ర పోషించారు.

ఏపీలోనూ టీడీపీ నామమాత్రమే...
కేంద్రంలో గత 22 ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ కచ్చితంగా విజయవంతమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం టీడీపీ బలోపేతం కోసం కూటమి కడుతున్నారు. బీజేపీని ఓడించడం లక్ష్యంగా కూటమి కడుతున్నానని అంటున్నారుగానీ అసలు ఉద్దేశం టీడీపీ కోసమే. ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ హోదాపై చంద్రబాబు ద్వంద్వ విధానంతో మాట్లాడుతున్నారు. హోదా ఏమైనా సంజీవనా అని గతంలో ఎద్దేవా చేశారు. ఇప్పుడు అయనే హోదా సర్వరోగ నివారణి అంటున్నారు. హోదా విషయంలో చంద్రబాబే గందరగోళంలో ఉండి అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నారు. చంద్రబాబును మీడియాలో పెద్దగా చూపుతారుగానీ ఆయన గల్లీ నాయకుడి కంటే అధ్వానం. మొన్న ఎన్నికల్లో రాహుల్‌ గాంధీతో కలసి నాకన్నా ఎక్కువగా హైదరాబాద్‌లో ప్రచారం చేశారు. 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో టీడీపీ పాత్ర నామమాత్రమే అవుతుంది. జాతీయ రాజకీయాల్లో మా పాత్ర ఉంటుంది. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ మా పాత్ర ఉంటుంది. ఏపీలోనూ ప్రాంతీయ శక్తులే గెలవాలి. చంద్రబాబు, జగన్, పవన్‌ కల్యాణ్‌ ఎవురూ శత్రువులు కాదు. ఏపీలో బలమైన ప్రాంతీయ శక్తి గెలవాలని కోరుకుంటున్నాం. ఏది మెరుగైనదో సమయాన్నిబట్టి చెబుతాం.

తెలంగాణలో కలపాలంటున్నారు...
కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయి. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ముథోల్‌ నియోజకవర్గం సరిహద్దులో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ నియోజకవర్గం ఉన్నది. ఆ సెగ్మెంట్‌లోని 40 గ్రామాలను తెలంగాణలో కలపాలని గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేశాయి. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే సైతం దీనికి మద్దతు తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, రైతు బంధు పథకాలు మహారాష్ట్రలో లేవు. అందుకే అక్కడి ప్రజలు కోరుతున్నారు.

ఓటు వేయని వారికి అడిగే హక్కు ఉండొద్దు...
తెలంగాణ ఎన్నికల్లోనూ పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోలేదు. గ్రామీణ ప్రజలు భారీగా ఓటు వేశారు. నగర ప్రాంతాల్లోని ఓటింగ్‌ శాతం దేశవ్యాప్తంగా తక్కువగానే ఉంటోంది. దీనిపై పార్లమెంటులోనూ ఒకసారి చర్చ జరిగింది. నిర్బంధ ఓటు విధానం తేవాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఓటు హక్కు వినియోగించుకోని వారికి ఫిర్యాదు చేసే అధికారం ఉండకూడదనేది నా అభిప్రాయం.

నేతలపై చులకన భావం వద్దు...
మనలో కొందరు చేసే చర్యల వల్ల ఏ సినిమాలో చూసినా రాజకీయ నేతలను, మీడియా ప్రతినిధులను హేళనగా చూపిస్తున్నారు. రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలో ఉన్న మేం ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. స్థాయికి మించి కొందరు చేసే విమర్శలను, బూతులను ప్రచార సాధనాలు యథాతథంగా ప్రసారం/ప్రచురించడం చేస్తున్నాయి. ఇలాంటివి అందరినీ చులకన చేస్తాయి. ప్రధాని మోదీని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని నేనైనా సరే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చేయవద్దు. అలాగే సీఎం స్థాయి వారిపై అనామకులు ఏదిపడితే అది మాట్లాడినా పరిశీలించుకుని ప్రసారం చేయాలి. ప్రత్యక్ష ప్రసారం అంశాలకు సైతం అసెంబ్లీలో మాదిరిగా కొన్ని సెకన్ల అంతరం ఉండే వ్యవస్థ పెడితే బాగుంటుందని నా సూచన.  

మరిన్ని వార్తలు