‘రైతు బంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’

23 Jun, 2020 14:30 IST|Sakshi

సిరిసిల్లలో మోడల్‌ రైతు బజారును ప్రారంభించిన కేటీఆర్‌

సాక్షి, రాజన్న సిరిసిల్ల: రైతు బంధు ఎగ్గొడతారని ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కె.తారక రామారావు‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. రైతు బంధు పెట్టిన తరువాతనే దేశంలో ప్రధానమంత్రి పీఎం కిసాన్ యోజన పథకం ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఆదుకుంటే కాంగ్రెస్ జాతీయ నాయకుడు అభిషేక్ సింగ్వీ అభినందించారని తెలిపారు. జిల్లా కేంద్రంలో మోడల్‌ రైతు బజారును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ...
(చదవండి: ఆహ్లాదం అంచున అగాధం!‌)

‘ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు గడిచేవి. కాళేశ్వరం మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఏటికి ఎదిరీదినట్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో 85 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తుకి నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రభుత్వం 12 వందల కోట్ల రుణమాఫీ చేసింది. 52 లక్షల ఖాతాల్లో రైతు బంధు జమ చేశాం. కరోన సమయంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యాపారాలు చేసుకునే విదంగా రైతు బజార్ నిర్మించాం. 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుంది. నియంత్రిత సాగుకు కొందరు వక్ర భాష్యం చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్ల సమీకృత రైతు బజార్లు నిర్మిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ పెరుగుతోంది. నీలి విప్లవం రాబోతోంది. పౌల్ట్రీ రంగంలో అగ్రగామిగా ఉన్నాం. సిరిసిల్ల జిల్లాను ప్రయోగ కేంద్రంగా తీసుకోబోతున్నాం. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి అన్ని మున్సిపాలిటీల్లో జరుగుతుంది. సిరిసిల్ల నియోజకవర్గన్ని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అగ్రశ్రేణిలో నిలబెడతాను’అని మంత్రి పేర్కొన్నారు.
(చదవండి: మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలి: కేటీఆర్‌)

మరిన్ని వార్తలు