కేటీఆర్‌.. తర్వాతి సీఎం

28 Dec, 2019 01:35 IST|Sakshi

ఆయనకు ఒరిజినాలిటీ ఉంది కాబట్టే ప్రజలు కోరుకుంటారు

కేసీఆర్‌ తర్వాత ప్రజాదరణ, నమ్మకం ఉన్న వ్యక్తి కేటీఆర్‌...

జిల్లా పరిషత్‌ల తరహాలో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గెలుస్తాం

తెలంగాణ భవన్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యాఖ్యలు  

సాక్షి, హైదరాబాద్‌: ‘మా యువ నాయకుడు కేటీఆర్‌లో ఒరిజినాలిటీ ఉంది. ఆయన సీఎం కావాలని అందరూ కోరుకుంటారు. కేసీఆర్‌ తర్వాత ఐదేళ్లు, పదేళ్లు.. ఎప్పటికైనా సీఎం ఎవరు అంటే.. కేటీఆర్‌నే సహజంగా కోరుకుంటారు. అధికారం కోసం పాకులాడకుండా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కేటీఆర్‌..’అని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహంతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘సీఎం కె.చంద్రశేఖర్‌రావు తర్వాత ప్రజాదరణ, నమ్మకం, ముక్కుసూటితనం, మాటకు కట్టుబడి ఉండే నైజం, డబుల్‌ గేమ్‌ ఆడకుండా నమ్ముకున్న వారి కోసం పనిచేయడం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి మా యువ నాయకుడు కేటీఆర్‌. తర్వాత సీఎం ఎవరు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. క్లాస్‌లో ఫస్ట్, సెకండ్‌ వచ్చే విద్యార్థులుంటారు. రేపేదైనా పోటీకి వెళ్తే.. ఫస్ట్‌ ఎవరొస్తరు అంటే చెప్పగలం.. అంతేకానీ ఫెయిలైన వ్యక్తి, మామూలు మార్కులతో పాసైన వ్యక్తి పేర్లు చెప్తామా?’అని ప్రశ్నించారు. తర్వాతి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాన్ని తమ అధినేత, పార్టీ చూసుకుంటుందని శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. 

కార్యకర్తలా పనిచేసిండు..
‘వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తొలుత సీఎం కేసీఆర్‌ను తర్వాత కేటీఆర్‌ను కలుసుకుని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకుంటారు. కేటీఆర్‌ ఎవరినీ తన వద్దకు పిలిపించుకోడు. ఊర్లోకి వెళ్లి చిన్న పిల్లలను అడిగినా తర్వాతి సీఎం ఎవరు అని అడిగితే కేటీఆర్‌ పేరే చెప్తారు. ఆయన నేరుగా రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమంలో పాల్గొనడంతో పాటు నిమ్స్‌ ఆసుపత్రిలో కేసీఆర్‌ను కాపాడుకోవడంలో మాతో పాటు కార్యకర్తలా పనిచేసిండు. ఈర్షా్యద్వేషాలతో చెడగొట్టేవాళ్లు మాత్రమే విమర్శలు చేస్తారు’అని శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.

వారిని ప్రజలు ఆదరించరు..
‘కొన్ని పార్టీలకు ఎన్నికల్లో రెచ్చగొట్టి ఓట్లు అడగటం అలవాటుగా మారింది. కులం మతం ప్రాతిపదికన ఓట్లు అడిగే వారిని ప్రజలు ఆదరించరు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌తో కలవడాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది. సీఎంను ఏ పార్టీ వారైనా కలవొచ్చు. టీఆర్‌ఎస్‌ అసలైన సెక్యులర్‌ పార్టీ. యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం టీఆర్‌ఎస్‌ ఘనత కాదా? మత కలహాలు సృష్టించి ఓట్లు దండుకోవాలనే కొందరి ప్రయత్నాలను అడ్డుకుంటాం. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ కుటుంబం ప్రాణాలను కూడా పణంగా పెట్టింది. ఎన్నికలంటేనే యుద్ధం. యుద్ధానికి సిద్ధం కాకుండా కొందరు మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌పై విమర్శలు చేస్తున్నారు’అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

ఉత్తమ్‌ హుందాగా మాట్లాడాలి
‘హుజూర్‌నగర్‌లో తన సతీమణిని గెలిపించుకోలేక పోయిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ హుందాగా మాట్లాడాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నా, తెలంగాణ మాత్రం ప్రశాంతంగా ఉంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభుత్వ అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేస్తారు. జిల్లా పరిషత్‌ల తరహాలో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం. రాష్ట్రాన్ని కాపాడుకునే సత్తా కేసీఆర్, కేటీఆర్‌కు ఉంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి దూరంగా ఉండాలనే నిబంధనను ఎంఐఎం కోసమే ఎత్తివేశారనే ఆరోపణ అర్ధరహితం’అని శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు