అభివృద్ధిపై విస్తృత ప్రచారం

2 Aug, 2019 06:50 IST|Sakshi

ప్రభుత్వ కార్యక్రమాలపై హైదరాబాద్‌ ప్రజలకు వివరించండి

రాజధానిలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కేటీఆర్‌ సూచన

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై హైదరాబాద్‌ నగర ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు చేరుకున్నాయని, కాళేశ్వరం వల్ల నగర నీటి అవసరాలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపు వల్లే నగరంలో తాగునీటితోపాటు విద్యుత్‌ కొరత లేదని చెప్పారు. రాజకీయంగానూ నగరంలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని, ప్రజల్లోనూ పార్టీపట్ల అభిమానం ఉందన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. గురువారం తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాలవారీగా కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరును ఆయన సమీక్షించారు.

ఈ నాలుగు ఎంపీ నియోజకవర్గాల పరిధిలో సభ్యత్వ నమోదు ప్రక్రియను ఈ నెల 10లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వ నమోదును లక్ష్యంగా నిర్దేశిం చారు. ఈ పది రోజుల్లో పూర్తిస్థాయిలో సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేసేలా చూడాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలను ఆదేశించారు. ఈ నెల 10 నుంచి 20లోగా బూత్, డివిజన్‌ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. నగరంలో దాదాపు 2 వేల నోటిపైడ్‌ స్లమ్స్‌ ఉన్నాయని, ఈ మేరకు ప్రతి బస్తీకి ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 20వతేదీ నాటికి బస్తీ కమిటీలతోపాటు డివిజన్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కమిటీలో అందరూ క్రియాశీలక సభ్యులే ఉండాలన్నారు. కనీసం 15 మంది సభ్యులు, గరిష్టంగా 33 మంది సభ్యులు కమిటీలో ఉండవచ్చన్నారు. ఈ కమిటీల్లో కనీసం 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే ఉండాలన్నారు. కమిటీల ఏర్పాటులో భాగంగా అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే లక్ష్యం పూర్తి చేసిన జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్‌ నియోజకవర్గాల్లో త్వరలోనే కమిటీలు వేయాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, సుధీర్‌రెడ్డిలకు సూచించారు. లక్ష మంది సభ్యత్వ లక్ష్యంతో పనిచేస్తున్న మేడ్చల్‌ నియోజకవర్గంలోనూ చాలా చురుగ్గా సభ్యత్వం నడుస్తున్న దని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సమావేశం నుంచే పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభ్యులుగా చేరిన కొందరితో కేటీఆర్‌ స్వయం గా మాట్లాడి, ధన్యవాదాలు తెలిపారు. సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నదని, కార్యకర్తలకు పార్టీ అం డగా ఉంటుందని వారికి తెలిపారు. ఈ సందర్భంగా కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న అంజయ్యనగర్‌లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న వెంకటరమణ అనే వ్యక్తితో కేటీఆర్‌ ఫోన్లో మాట్లాడి సభ్యత్వ నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు