మునుగుతున్న పడవకు ఓటేస్తారా?

2 Oct, 2019 02:52 IST|Sakshi

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ గెలుపుతో ప్రయోజనమేంటి?

టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జులతో కేటీఆర్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: మునిగిపోతున్న పడవ లాంటి కాంగ్రెస్‌కు హుజూర్‌నగర్‌ ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయరని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి హుజూర్‌నగర్‌లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ప్రచారం, ఎన్నికల వ్యూహం అమలు, పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయం తదితర అంశాలపై కేటీఆర్‌ మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఇతర ఇన్‌చార్జులు క్షేత్ర స్థాయి పరిస్థితిని మంగళవారం కేటీఆర్‌కు వివరించారు. మండలాలు, మున్సిపాలిటీలు, వివిధ సామాజికవర్గాలు, పార్టీల వారీగా క్షేత్రస్థాయిలోని పరిస్థితిపై వారు సేకరించిన వివరాలను నివేదించారు.

ఈ సందర్భంగా ఇన్‌చార్జులకు పలు అంశాలపై కేటీఆర్‌ దిశా నిర్దేశం చేయడంతో పాటు, ప్రచార సరళిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని, ఈ నెల 4తో పాటు, దసరా తర్వాత ఒకట్రెండు రోజులు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటానని కేటీఆర్‌ వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు వెయ్యి శాతం సంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని, క్షేత్ర స్థాయి రిపోర్టుల ప్రకారం టీఆర్‌ఎస్‌ మంచి మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.

దేశం, బీజేపీకి స్పందన ఉండదు..
అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విపక్షాలు.. ప్రస్తుతం ఎవరికి వారుగా విడివిడిగా పోటీ చేస్తున్న తీరు.. ఆయా పక్షాల అనైక్యతకు అద్దం పడుతోందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్‌ గెలుపొందడం ద్వారా హుజూర్‌నగర్‌ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వంలో లేని వారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదనే అంశాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఖాయమని, బరిలో ఉన్న టీడీపీ, బీజేపీకి కూడా ప్రజల నుంచి పెద్దగా ఆదరణ ఉండకపోవచ్చని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని, ఉప ఎన్నికలో విజయం సాధించడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేని ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌పై ఎలాంటి వివక్ష చూపకుండా, రాష్ట్రంలోని అన్ని ఇతర నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్‌.. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదని కేటీఆర్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా