టీఆర్‌ఎస్‌ వైపే తెలంగాణ ఓటర్లు

5 Apr, 2019 07:12 IST|Sakshi
అలీ కేఫ్‌ వద్ద రోడ్‌షోలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  

అంబర్‌పేట:  లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మన ఓటు టీఆర్‌ఎస్‌కు వేసుకొని తెలంగాణ అభివృద్ధి చేసుకుందామని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి అంబర్‌పేట నియోజకవర్గంలో సికింద్రాబాద్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. అంబర్‌పేట నియోజకవర్గంలో అలీ కేఫ్‌ నుంచి ప్రారంభమైన రోడ్‌షో ఛే నెంబర్‌ మీదుగా ఫీవర్‌ ఆసుపత్రి, శంకర్‌మఠ్‌ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. చౌకీదార్‌ అని చెప్పుకునే నరేంద్రమోదీ ఐదేళ్లలో చేసిందేమీ లేదని, అలాగే కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో 15 ఏళ్లు ప్రచారం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.

బీజేపీకి ఓటు వేస్తే నరేంద్రమోదీకి వెళ్తుందని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాహుల్‌ గాంధీకి పోతుందని, అదే టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే తెలంగాణకే ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళలు పోపులడబ్బాలో దాచి పెట్టుకున్న డబ్బును సైతం మోదీ నోట్ల రద్దుతో దోచేశాడని ఎద్దేవా చేశారు. అంబర్‌పేట ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే కాలేరు ఇప్పటికే తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ విదేశాల్లో చదువుకున్న ఉన్నత విద్యావంతుడని, ఎంపీగా గెలిపిస్తే ఎంతో ఉత్సాహంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడన్నారు. రోడ్‌షోలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మేయర్‌ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు