ఇళ్లు కూల్చేవాళ్లం కాదు..

23 Nov, 2018 08:45 IST|Sakshi
రసూల్‌పుర, బోయిన్‌పల్లిలో కేటీఆర్‌ రోడ్‌ షో

సింహం సింగిల్‌గానే వస్తుంది

కంటోన్మెంట్‌ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్‌  

రసూల్‌పురా:   తాము ఇళ్లు కట్టించే వాళ్లమే కానీ కూల్చే వాళ్లం కాదని, సచివాలయం నిర్మిస్తే పేదల ఇళ్లకు ఏలాంటి నష్టం కలగదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గంలోని రసూల్‌పురాలో గురువారం మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సాయన్న తరఫున మంత్రి కేటీఆర్‌ రసూల్‌పురా, బోయిన్‌పల్లి, మారేడుపల్లి  ప్రాంతాల్లో రోడ్‌షో సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించారు. రసూల్‌పురాలో గురువారం రాత్రి  మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదప్రజలకు ఇళ్ల పట్టాలు అంద జేస్తామని, భూమార్పిళ్లను అమలు చేస్తామని  హామీ ఇచ్చారు.  కంటోన్మెంట్‌లో ప్రజలపై భారం పడుతున్న నీటి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కంటోన్మెంట్‌ నియోజకవర్గంతో పాటు నగరంలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యలు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డుల పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బోర్డు సభ్యులు సాద కేశవరెడ్డి, అనితాప్రభాకర్‌ చేసిన కృషి మరవలేనిదని ప్రశంసించారు. సింహం సింగిల్‌గా వస్తుందని, కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు నాలుగు పార్టీలు కూటమిగా ఒక్కటై ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో సాయన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మంత్రి రెండుగంటలు ఆలస్యంగా వచ్చినా వేలాది మంది ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి రాక కోసం ఎదురు చూశారు. కార్యక్ర మంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు ప్రభాకర్, అశోక్, ధన్‌రాజ్, అజ్జు, జబ్బార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు