కాంగ్రెస్‌తో కష్టాలే..

24 Nov, 2018 11:10 IST|Sakshi
మహేశ్వరం రోడ్‌ షోలో గథాధారిగా కేటీఆర్‌. చిత్రంలో తీగల కృష్ణారెడ్డి

కూటమిని నమ్మి మోసపోవద్దు

60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేసిన అభివృద్ధి శూన్యం  రామ్మోహన్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డిలను గెలిపించండి  

సింహం సింగిల్‌గానే వస్తుంది.. కూటమికి బుద్ధి చెబుదాం  

రోడ్‌షోలో మంత్రి కేటీఆర్‌

ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పర్యటన

ఎల్‌బీనగర్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ కల్తీ పార్టీగా మారిందని, ప్రజాకూటమి పేరుతో ప్రజలను మాయ చేసేందుకు వస్తున్న ఆ కూటమికి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి ఆయన ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పర్యటించారు. తొలుత సరూర్‌నగర్‌ చెరువుకట్ట, మన్సురాబాద్, వనస్థలిపురం రైతుబజార్‌ ప్రాంతాల్లో స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌తో కలసి రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్‌ పాలనలో శాంతిభద్రతలు కరువై నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మత కలహాలు, భూకబ్జాలతో పరిపాలన సాగిందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక నాలుగు పార్టీలు కలసి కూటమి కట్టి అసాధ్యంగాని హమీలతో అధికారంలోకి వచ్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. కూటమి కుయుక్తులను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎల్బీనగర్‌ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌ను గెలిపిస్తే కారులో అసెంబ్లీకి వెళ్లి కేసీఆర్‌కు సైనికుడిగా ఉండి స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడన్నారు. నియోజకవర్గం అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, కుంట్లూర్‌ వెంకటేష్‌గౌడ్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర భవిష్యత్‌ కోసం మరో అవకాశం ఇవ్వండి
పహాడీషరీఫ్‌: తెలంగాణ బంగారు భవిష్యత్‌ కోసం మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కేటీఆర్‌ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహిన్‌నగర్, జిల్లెలగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్, టీడీపీలు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక టీఆర్‌ఎస్‌ సర్కార్‌ విద్యకు పెద్ద పీట వేసిందన్నారు. ముస్లిం విద్యార్థుల కోసం 200కు పైగా మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేసి 7 వేల మంది విద్యార్థుల చదువుకు బాటలు వేసినట్టు చెప్పారు. ఇందులో ఒక్కో విద్యార్థిపై రూ.1.2 లక్షలు వెచ్చిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, టీడీపీలు ముస్లిం ప్రజలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వినియోగించుకున్నాయని, టీఆర్‌ఎస్‌ మాత్రం అన్ని కుల, మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. ముస్లింలకు రంజాన్‌ తోఫా, హిందువులకు బతుకమ్మ చీరలు, క్రిస్టియన్లకు కానుకలు అందించామన్నారు.

షాదీ ముబారక్‌ పేదలకు వరంగా మారిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో నగరంలో తరచూ కర్ఫ్యూలు విధించారని, తమ హయాంలో అలాంటి వాటికి తావులేదన్నారు. మంచి మనసున్న తీగల కృష్ణారెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింల కోసం చేసిందేమి లేదని, కేసీఆర్‌ మాత్రం వారికోసం రూ.2 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించారన్నారు. పహాడీషరీఫ్‌ దర్గా ర్యాంప్‌ కోసం రూ.8.5 కోట్లు విడుదల చేశామన్నారు. బీజేపీతో టీఆర్‌ఎస్‌ ఎప్పుడూ దోస్తీ చేయలేదని ఆయన గుర్తు చేశారు. పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ అంధకారం తప్పదని హెచ్చరించారు. పర్యటనలో మంత్రి వెంట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సలీం, మజ్లిస్‌ నాయకులు అహ్మద్‌ సాధి, ఉమర్‌ బామ్, హమేద్‌ అజీజ్, అహ్మద్‌ కసాది, అబ్దుల్‌ రవూఫ్, టీఆర్‌ఎస్‌ నాయకులు కప్పాటి పాండురంగారెడ్డి, అబ్దుల్‌ బిన్‌ అవద్, ఎక్బాల్‌ బిన్‌ ఖలీఫా, మజ్హర్‌ అలీ, దూడల సుధాకర్‌ గౌడ్, మక్దూం పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు