కారు ఆగొద్దు.. డ్రైవర్‌ మారొద్దు

28 Nov, 2018 08:57 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్, చిత్రంలో గాంధీ

ప్రగతి రథచక్రం పరుగు పెట్టాలి  టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి  

చందానగర్‌ టు ఓల్డ్‌ ముంబై జాతీయ రహదారి మీదుగా లక్డీకాపూల్‌ వరకు మెట్రో పొడిగింపు  

సిటీలో 3,800 ఎలక్ట్రికల్‌ బస్సులు రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌  

శేరిలింగంపల్లి/గచ్చిబౌలి: ‘కారు ఆగొద్దు.. డ్రైవర్‌ మారొద్దు. ప్రగతి రథ చక్రం పరుగు పెట్టాలంటే టీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కట్టాల’ని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారానగర్, మియాపూర్‌ అల్వీన్‌ కాలనీ చౌరస్తాలో రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే మత కలహాలు చోటుచేసుకుంటాయని తప్పుడు ప్రచారం చేశారని... మరి నాలుగున్నరేళ్ల పాలనలో కులం, మతం, ప్రాంతం పేరుతో ఏమైనా వివక్ష జరిగిందా? అని ప్రశ్నించారు. కులమతాల పేరుతో ప్రజల్ని వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాను అబిడ్స్‌ గ్రామర్‌ స్కూల్‌లో చదివే రోజుల్లో కాంగ్రెస్‌ హయాంలో ప్రతిఏటా 10రోజుల పాటు కర్ఫ్యూ ఉండేదన్నారు.

నేడు కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో నాలుగు సెకన్లు కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు. దేశంలోనే సురక్షిత ప్రాంతంగా హైదరాబాద్‌ అగ్రభాగంలో ఉందన్నారు. ఇప్పటికే నగరంలో 5లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని, మరో 5లక్షలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ వస్తే కరెంట్‌ ఉండదని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని... వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటుతో పాటు పరిశ్రమలకు, గిరిజన వాడలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పరిశ్రమలకు కరెంటు ఇవ్వకుంటే ఇందిరాపార్కు వద్ద పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారన్నారు. పరిశ్రమలకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ అందిస్తున్నామని.. అపార్ట్‌మెంట్లు, షాపులకు జనరేటర్స్‌ బాధ తప్పిందన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని చందానగర్‌ నుంచి ఓల్డ్‌ ముంబై జాతీయ రహదారి మీదుగా లక్డీకాపూల్‌ వరకు 26కిలోమీటర్ల మేర మెట్రో రైలును పొడిగిస్తామని హామీ ఇచ్చారు. కాలుష్య నియంత్రణకు 3,800 ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొస్తామన్నారు. 

తారానగర్‌ రోడ్‌ షోలో ప్రజలు
కేసీఆర్‌ సింహం...  
ప్రతిపక్షాలు మహాకూటమి పేరుతో గుంపులుగా వస్తుంటే... సీఎం కేసీఆర్‌ సింహంలా సింగిల్‌గానే వస్తున్నారన్నారు. కేసీఆర్‌ను గద్దె దించే వరకు గడ్డం తీసుకోబోనని చెబుతున్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గబ్బర్‌ సింగ్‌ కాలేడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని... ఇప్పుడు ఆ రెండు పార్టీలు జట్టుకట్టడంతో ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తోందన్నారు. రూ.2వేల కోట్లతో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లోని 35 లక్షల మందికి తాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. శేరిలింగంపల్లిలో కొలువుదీరిన ఐటీ కంపెనీలతో 29 రాష్ట్రాల ప్రజలు సిటీలో స్థిరపడ్డారని.. ఈ నియోజకవర్గాన్ని మినీ భారత్‌గా ఆయన అభివర్ణించారు. నగరంలో నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండడంతో.. శాంతిభద్రతలు పటిష్టంగా ఉండడంతో పెట్టుబడులు భారీగా వస్తున్నాయన్నారు. దుర్గం చెరువు మాదిరి శేరిలింగంపల్లిలోని చెరువులన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ ఏనాడు వ్యక్తిగత పనుల కోసం రాలేదని, అభివృద్ధి పనులే అడిగారన్నారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌ రాగం సుజాతా యాదవ్, కార్పొరేటర్లు రాగం నాగేందర్‌ యాదవ్, కొమిరిశెట్టి సాయిబాబా, జగదీశ్వర్‌గౌడ్, మేకా రమేష్, హమీద్‌ పటేల్, పూజితగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు