యురేనియంకు అనుమతించం : కేటీఆర్‌

17 Sep, 2019 02:14 IST|Sakshi

నల్లమల సహా రాష్ట్రంలో ఎక్కడా తవ్వకాలకు ఒప్పుకోం

మంత్రి కేటీఆర్‌ తీర్మానం

ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన నల్లమల అడవులతోపాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా యురేనియం తవ్వకాలను అనుమతించేదిలేదని శాసనసభ తీర్మానించింది. యురేనియం నిక్షేపాల తవ్వకాలను వ్యతిరేకిస్తూ గనులు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికతతో పంటలు పండే భూమి, పీల్చే గాలి, తాగే నీరు కలుషితమయ్యే ప్రమాదముందని.. యురేనియం తవ్వకాల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది. ప్రజల ఆందోళనలతో ప్రభుత్వం ఏకీభవిస్తోందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అరుదైన జంతు జీవజాలం, వృక్షజాలంతో జీవవైవిధ్యానికి ఆలవాలమైన అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే ప్రమాదముందని, మానవాళితోపాటు సమస్త ప్రాణకోటి మనుగడకు ముప్పు పరిణమించే అవకాశాలున్నందున యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

సవరణలతో మళ్లీ...
ముందుగా నల్లమల అడవుల్లో మాత్రమే యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు. అయితే దానిపై కాంగ్రెస్‌ సభ్యులు కొన్ని సవరణలు కోరుతూ చర్చకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ తీర్మానాన్ని అప్పటికే ఆమోదించినందున అవకాశం ఇవ్వడం కుదరదని స్పీకర్‌ తేల్చిచెప్పారు. యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని మీరే అడిగి.. ఇప్పుడు చర్చకు పట్టుబట్టడం ఏమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. అయినా సభ్యులు బిగ్గరగా మాట్లాడుతుండటంతో కేటీఆర్‌ కాంగ్రెస్‌ సభ్యుల దగ్గరకు వెళ్లి మాట్లాడి సర్ది చెప్పడంతో వారు కూర్చున్నారు. అనంతరం ఆ తీర్మానానికి సవరణలు చేసి సభలో మళ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నల్లమల అటవీ ప్రాంతమే కాదు... రాష్ట్రంలో ఎక్కడా యురేనియం తవ్వకాలను అనుమతించబోమంటూ సవరణ చేశారు. ఆ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని స్పీకర్‌ పోచారం ప్రకటించారు.

ఐక్యంగా ముందుకు...: కేటీఆర్‌
యురేనియం తవ్వకాల విషయంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వ్యతిరేక పోరాటంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. యురేనియం విషయంలో రెండు అంశాలు ఉన్నాయని, ఒకటి అన్వేషణ కాగా రెండోది తవ్వకాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏఎండీకి మైదాన ప్రాంతంలో అన్వేషణకు ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదే అటవీ ప్రాంతమైతే రాష్ట్ర వన్య సంరక్షణ మండలి అనుమతి తప్పనిసని చెప్పారు. 1992 నుంచి 2013 వరకు అన్వేషణ, తవ్వకాలకు అనుమతులిచ్చారని... తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. అన్వేషణ అనేది పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉన్నా మైనింగ్‌కు మాత్రం రాష్ట్ర ఆమోదం అవసరమన్నారు. అప్పుడే యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దాన్ని అమలు చేస్తుందన్నారు. కేంద్రం జాతి ప్రయోజనాలు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే సంఘటితంగా ముందుకు సాగుదామన్నారు.

అన్వేషణ కూడా ఆపాల్సిందే: భట్టి విక్రమార్క
రాష్ట్రంలో యురేనియం తవ్వకాల విషయంలోనే కాకుండా యురేనియం అన్వేషణను కూడా కేంద్రం ఆపాల్సిందేనని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. నల్లమల అటవీ ప్రాంతమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని సవరించడంపట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, పాషా ఖాద్రీ మాట్లాడారు.  

మరిన్ని వార్తలు