అమిత్‌ షా కాదు.. భ్రమిత్‌ షా: కేటీఆర్‌

16 Sep, 2018 14:39 IST|Sakshi
కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పేరు భ్రమిత్‌ షా అని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. బీజేపీ పాలనలో అచ్చేదిన్‌ కాదు కదా.. ప్రజల సచ్చేదిన్‌ వచ్చిందని విమర్శించారు. బీజేపీ పాలనలో బ్యాంకులకు పోదామంటే ప్రజలకు భయమేస్తుందన్నారు. ఆదివారం జలవిహార్‌లో సనత్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో మంత్రి తలసాని శ్రీనివాస్‌తో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమిత్‌ షాకు మతిమరుపు వచ్చిందని, 2002లో ప్రధాని మోదీ గుజరాత్‌లో, 2004లో దివంగత నేత వాజ్‌పేయ్‌ ముందస్తుకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. ఇవన్నీ మరిచిపోయి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌తోనే ఉంటుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా  సిద్దమన్న ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయన్నారు. రాజకీయాలకతీతంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడటం లేదని, రాష్ట్రాలపైనే కేంద్ర ఆధారపడుతోందన్నారు. కావేరీ నీళ్ల కోసం కర్ణాటక, తమిళనాడుల్లో అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నాయని, కానీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నీళ్ల కోసం కొట్లాడుతుంటే.. ఇతర పార్టీలు కేసులు పెడుతూ వస్తున్నాయన్నారు. ప్రజలకు నీళ్లు తేవాలనే సోయి ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. ఈ కొట్లాటలు ఎందుకని, మళ్లీ ప్రజలు ముందుకే పోదామని ముందస్తుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు