మా బాసులు ఢిల్లీలో లేరు

14 Jan, 2020 02:00 IST|Sakshi

గల్లీలోని ప్రజలే మా బాసులు

మోదీ, రాహుల్‌తో మాకేం భయంలేదు

టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తల భేటీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీకి గల్లీలోని ప్రజలే బాస్‌లని, ప్రతిపక్ష పార్టీల మాదిరి తమ బాసులు ఢిల్లీలో లేరని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఈ మకర సంక్రాంతితో వారి భ్రాంతి తొలగిపోతుందన్నారు. ‘నాకు బీజేపీ అంటే భయమని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అంటున్నారు. నాకు ప్రధాని నరేంద్రమోదీ అన్నా.. రాహుల్‌ అన్నా.. భయం లేదు. నాకు ఢిల్లీలో బాసులు లేరు. గల్లీలో ఉన్నారు. ప్రజలే మాకు బాసులు’అని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి ఉన్న బలమెంతని టీఆర్‌ఎస్‌ భయపడాలని ప్రశ్నించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 600లకు పైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను నిలపలేకపోయినందుకు, ఉప ఎన్నికల్లో డిపాజిట్లు పోగొట్టుకున్నందుకు భయపడాలా? అని ఎద్దేవా చేశారు.

సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. సోషల్‌ మీడియాలో ప్రచార వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర పెన్షన్లలో కేంద్రం వాటా గురించి బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పదేళ్ల హయాంలో విడుదల చేసిన నిధుల కంటే గడిచిన ఐదేళ్లలో మున్సిపాలిటీలకు రెట్టింపు నిధులు విడుదల చేశామని తెలిపారు. దీనిపై దమ్ముంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్‌ విసిరారు. గతంలో మున్సిపాలిటీల్లో 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అమలు చేయడం తన ముందున్న బాధ్యత అన్న కేటీఆర్, దాని అమలులో పర, తమ భేదాలుండవని, అవినీతి చీడ రూపుమాపేలా చర్యలుంటాయని స్పష్టం చేశారు. 

అసత్య ఆరోపణలను సమర్ధంగా తిప్పికొట్టండి..
ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను, విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పార్టీ సోషల్‌ మీడియా ఆర్మీకి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇతర పార్టీల మాదిరి పెయిడ్‌ సోషల్‌ మీడియా బలగం లేదని, ఉన్నదంతా సీఎం కేసీఆర్, పార్టీ అంటే ప్రేమతో పనిచేసే బలమైన సైన్యమే అన్నారు. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయానికి అవసరమయిన ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలన్నారు. పలు రాజకీయ పార్టీలు తమ ఐడియాలజీకి మద్దతు ఇవ్వకుంటే నీచంగా ట్రోల్‌ చేస్తున్నారని, అలాంటి వారికి సబ్జెక్ట్‌తోనే సమాధానం చెప్పాలన్నారు. కొన్ని పార్టీల విభజన ప్రయత్నాలు చెల్లవని.. ప్రజలు ప్రభుత్వం పనితీరు, వాటితో కలిగిన ప్రయోజనాలను చూసే ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తారని తెలిపారు.

ప్రతిపక్షాలు చిచ్చు పెట్టేందుకే సోషల్‌ మీడియాను వాడుకుంటున్నాయని, తమ పార్టీ ఎప్పుడూ సోషల్‌ మీడియాను ఉద్రిక్తతలు పెంచేందుకు వాడుకోలేదని తెలిపారు. కేసీఆర్‌ సైతం సోషల్‌ మీడియాలో క్రియాశీలకంగా ఉంటారని, దీంతో పబ్లిక్‌ పల్స్‌ తెలుసుకోవడానికి వీలవుతుందని నమ్ముతారని తెలిపారు. సోషల్‌ మీడియా కార్యకర్తలకు వేధింపులు ఎదురైతే పార్టీ అండగా ఉంటుందన్నారు. సోషల్‌ మీడియా గులాబీ సైనికులకు గుర్తింపు, గౌరవం ఇస్తామన్నారు. పార్టీ సోషల్‌ మీడియా కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా పార్టీ యువ నాయకులు సతీష్, క్రిషాంక్, జగన్, దినేశ్‌ను మున్సిపల్‌ ఎన్నికల సోషల్‌ మీడియా కో–ఆర్డినేటర్లుగా కేటీఆర్‌ నియమించారు.

మరిన్ని వార్తలు