గడ్డం తీసుకోకపోతే సన్నాసుల్లో కలిసిపోతారు

1 Aug, 2018 14:46 IST|Sakshi

నిజామాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గడ్డం తీసుకోకపోతే ఆయనే సన్నాసుల్లో కలిసిపోతారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  నిజామాబాద్ నగరంలో బుధవారం మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..గడ్డం ఉన్న ప్రతీ ఒక్కరూ గబ్బర్‌ సింగ్‌లు అయిపోరని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఎందుకు గద్దె దింపాలని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకా లేక రైతులకు రుణ మాఫీ చేస్తున్నందుకా లేక రైతు బంధు పెట్టుబడులు ఇచ్చినందుకా అని ప్రశ్నించారు. 60 ఏండ్ల దరిద్రం నాలుగేళ్లలో పోతుందా అని సూటిగా అడిగారు.

మా అధిష్టానం ఢిల్లీ ఉండదు..గల్లీలో ఉంటుందని అన్నారు. విజయవాడ వెళ్లి చంద్రబాబు కాళ్లపై మోకరిల్లే వారితో తెలంగాణ అభివృద్ధి సాధ్యమా లేక టీఆర్‌ఎస్‌తో సాధ్యమా ప్రజలు ఆలోచించాలన్నారు. షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డి లాంటి కాంగ్రెస్‌ పెద్దలు టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్‌ అధికారంలోకి వస్తే ఒకటే సారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటున్నారు..మరి కర్ణాటకలో నాలుగు దశల్లో ఎందుకో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.  నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌ పల్లి వద్ద విమానాశ్రమ ఏర్పాటు, క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లో ఆధునిక బస్‌ టెర్మినల్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు