బాలయోగిది హత్యే!

5 Apr, 2019 14:12 IST|Sakshi

ఆధారాలు లేకుండా చేసింది.. సూత్రధారి చంద్రబాబే

ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు అధ్యక్షుడు సూర్యనారాయణరావు 

అమలాపురం టౌన్‌: పశ్చిమగోదావరి జిల్లాలో 19 ఏళ్ల కిందట జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన అప్పటి లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగిది హత్య అని ఉభయ రాష్ట్రాల శెట్టిబలజి మహానాడు అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. ఈ హత్యా పథకంలో చంద్రబాబే సూత్రధారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికార అండతో ఆనాడు బాలయోగి హత్యను బయటకు రాకుండా చేసిందని ఆరోపించారు. 

అప్పటి నుంచి బాలయోగి కుటుంబాన్ని కన్నెత్తి కూడా చూడని టీడీపీ ముఖ్యనేతలు ఎన్నికలు వచ్చేసరికి ఆయన కుమారుడు హరీష్‌మాథూర్‌ని తెరమీదకు తీసుకొచ్చి సానుభూతితో ఓట్లు దండుకునేందుకు చూస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాలయోగి మరణంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ఇటీవల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి వినతి పత్రం ఇచ్చినట్టు సూర్యనారాయణరావు తెలిపారు. బాలయోగి హత్యపై తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

బాబు సోదరుడికి ఇంతటి దుస్థితా? 
‘నా స్నేనిహితుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఇంట్లో అచేతనంగా ఉండటం తనను కలిచివేస్తోందని సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మూర్తినాయుడు ఆ దుస్థితిలో ఉండడానికి చంద్రబాబే కారణమని చెప్పారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం రక్త సంబంధాలను కూడా లెక్క చేయరనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. సమావేశంలో శెట్టిబలిజ మహానాడు నాయకులు మట్టపర్తి నాగేంద్ర, బొంతు గోవిందశెట్టి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు