నేను అభిమన్యుడిని.. మరణం కూడా విజయమే!

27 Nov, 2017 09:53 IST|Sakshi
ఆప్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామ్‌లీలా మైదానంలో పార్టీ కార్యకర్తల సందోహం

సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏర్పాటై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సభలో పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా సీనియర్‌ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అసమ్మతి నేతలు, భిన్న స్వరాలకు సైతం వేదికపై అవకాశం కల్పించడం గమనార్హం. ఆప్‌ రాజస్థాన్‌ ఇన్‌చార్జ్‌, అసమ్మతి నేతగా ముద్రపడ్డ కుమార్‌ విశ్వాస్‌ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు.

ఎప్పటిలాగే అసమ్మతి గళాన్ని వినిపిస్తూ..  పార్టీ నాయకత్వంపై పరోక్ష వ్యంగ్యాస్త్రాలు, ఆరోపణలు సంధించారు. అధినేత కేజ్రీవాల్‌పై విరుచుకుపడేందుకు ఈ వేదికను కుమార్‌ విశ్వాస్‌ ఉపయోగించుకున్నారు. ‘గత ఏడెనిమిది నెలలుగా నేను మాట్లాడలేదు. అందుకు కారణం స్వేచ్ఛాయుత చర్చలు జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు జరగకపోవడమే. కమిటీ చివరి సమావేశంలో నన్ను మాట్లాడనివ్వలేదు’ అని కుమార్‌ విశ్వాస్‌ అన్నారు. తాను ఫుల్‌టైమ్‌ రాజకీయ నాయకుడిని కాదని పార్టీలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ, తాను ఫుల్‌టైమ్‌ భారతీయుడిని, పార్ట్‌టైమ్‌ రాజకీయ నాయకుడిని అని ఆయన అన్నారు. ప్రతి మహాభారతంలోనూ ధర్మరాజు ఆవశ్యకత ఉందని పేర్కొంటూ.. పార్టీలో అసమ్మతివాదులకు సైతం గళమెత్తే అవకాశం కల్పించాలని కోరారు. పార్టీలో తమలో తాము కొట్లాడటం మాని.. ప్రజల స్వప్నాలను సాకారం చేసేందుకు పోరాడాలని సూచించారు. ‘20-22 మంది నాపై విరుచుకుపడి దాడి చేశారు. నిన్ను అవమానించి.. పార్టీ నుంచి పారిపోయేలా చేస్తామని బెదిరించారు. నేను పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని ఈ వేదిక నుంచి స్పష్టం చేస్తున్నా.. నేను అభిమన్యుడిలాంటివాణ్ని.. మరణం కూడా నాకు విజయమే’ అని కుమార్‌ విశ్వాస్‌ ఉద్ఘాటించారు.
 

మరిన్ని వార్తలు