మాఫీ ఎలా?

30 May, 2018 10:16 IST|Sakshi

ఉన్నతాధికారులతో సీఎం కుమారస్వామి భేటీ

ఆర్థిక స్థితిపై సమీక్ష

నేడు కార్యాచరణ ప్రణాళిక విడుదల?

నేడు రైతు సంఘాలతో సమావేశం

సాక్షి, బెంగళూరు: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాతల రుణ మాఫీ చేయాలంటూ రైతుసంఘాలు, ప్రతిపక్ష బీజేపీ నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడితో ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో జేడీఎస్‌ గద్దెనెక్కితే రైతులకు రూ. 53 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని కుమారస్వామి హామీనిచ్చారు. అనూహ్య పరిస్థితుల్లో కుమార సీఎం కావడం, రుణాల రద్దు కోసం బీజేపీ సహా రైతుసంఘాలు నిరసనలు చేపట్టడం తెలిసిందే. రుణమాఫీపై ఉన్న సాదకబాధకాలపై మంగళవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో రుణమాఫీపై తీవ్రంగా చర్చించినట్లు తెలిపారు. నేడు (బుధవారం) రుణమాఫీపై ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేస్తామని చెప్పారు.

రూ.55 వేల కోట్లు అవసరం
తొలుత రైతులకు రుణమాఫీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతుందనే విషయంపై అధికారులను ముఖ్యమంత్రి ఆరా తీశారు. సీఎం నివాసంకృష్ణాలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితిని వివరించారు. వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార సంస్థల్లోని మొత్తం రుణాలను మాఫీ చేయాలంటే రూ. 55 వేల కోట్లు అవసరమవుతాయని ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. ఆరోగ్య బీమా పథకం యశస్వీపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో అమలు తీరుతెన్నుల గురించి ఆరా తీశారు. పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంపై సూచనలిచ్చారు.

నేడు రైతు సంఘాలతో సీఎం భేటీ
రైతు రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి నేడు (బుధవారం) ఉదయం 11.15 గంటలకు విధానసౌధలో రైతు సంఘాలతో సమావేశం నిర్వహిస్తారు. ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర్‌ ఈ భేటీలో పాల్గొననున్నారు. సమావేశంలో పాల్గొనాల్సిందిగా బీజేపీ పక్ష నేత బీఎస్‌ యడ్యూరప్పనూ ఆహ్వానించారు. రుణమాఫీపై ప్రధానంగా చర్చించనున్నారు.

కాంగ్రెస్‌కు కుమార షాక్‌ : బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల రద్దు
బొమ్మనహళ్లి : రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మంత్రి మండలి ఏర్పాటుకాలేదు. మంత్రివర్గంలో చోటు కోసం రెండు పార్టీల నుంచి ఔత్సాహికులకు కొదవ లేదు. దీంతో ఇరుపార్టీల ఎమ్మెల్యేను శాంతపరచడానికి సీఎం కుమారస్వామి గత ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్, బోర్డుల అధ్యక్షుల పదవీకాలం ముగియకముందే రద్దు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే బోర్డు, కార్పొరేషన్ల పదవుల్లో ఉండేవారందరూ కాంగ్రెస్‌ నాయకులే. పదవీకా లం ఉండగానే ఎలా రద్దు చేస్తారని అధ్యక్షలు రుసరుసలాడుతున్నారు. కుమారస్వామిది ఏకపక్ష నిర్ణయమని ఆక్షేపిస్తున్నారు.

మరిన్ని వార్తలు