నన్ను క్షమించండి: కుమారస్వామి

23 Jul, 2019 18:27 IST|Sakshi

సభలో కుమారస్వామి భావోద్వేగ ప్రసంగం

సీఎం ప్రసంగం అనంతరం.. విశ్వాస పరీక్ష

 రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తం.. బెంగళూరులో 144 సెక్షన్‌

మూడు రోజులపాటు బార్‌ షాపుల బంద్‌

సాక్షి, బెంగళూరు: ఉత్కంఠ పరిణామాల నడుమ కర్ణాటక రాజకీయం తుదిదశకు చేరుకుంది. విశ్వాస పరీక్షపై సభ్యులంతా ప్రసంగించిన అనంతరం.. చివరగా సీఎం కుమారస్వామి మాట్లాడారు. విశ్వాసపరీక్షపై సీఎం ఉద్వేగంగా ప్రసంగించారు. కన్నడ ప్రజలకు తన పాలనలో ఎన్నో మంచి పనులు చేశానని, ఏమైనా తప్పులు చేసి ఉంటే తనను క్షమించాలని ప్రజలను కోరారు. అనుకోకుండా తాను రాజకీయాల్లోకి వచ్చానని.. పాలనలో పొరపాటున కొన్ని తప్పులు కూడా చేశానని అన్నారు. సభలో  ఆయన మాట్లాడుతూ.. కన్నడ సంక్షోభంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరి సభ్యుల అభిప్రాయం తీసుకోవడం కోసం.. విశ్వాస పరీక్ష కొంత ఆలస్యమయినట్లు సభలో ఒప్పుకున్నారు. సంకీర్ణాన్ని భాజపా ఎలా అస్థిరపరిచిందో సభలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రసంగం అనంతరం రాజీనామా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.

ప్రస్తుతం సభలో ఆయన ప్రసంగం కొనసాగుతోంది. ఆయన మాట్లాడిన వెంటనే స్పీకర్‌ విశ్వాస పరీక్షను చేపట్టనున్నారు. కుమార స్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్‌-కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేంగా నినాదాలు చేస్తూ.. పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భద్రతను కుట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో బార్ షాపులను మూసేశారు

రాజధాని ప్రాంతం బెంగళూరులో 144 సెక్షన్‌ అమలు చేశారు. సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ సభ్యులు 105 మంది ఉన్నారు. మరోవైరు రెబల్స్‌తో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల సంఖ్య 101 మాత్రమే.  స్పీకర్‌, నామినేటేడ్‌ సభ్యులను మినహాయిస్తే అధికారపక్షం బలం 99కి పడిపోతుంది. సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్‌, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు సభకు హాజరుకాలేదు

మరిన్ని వార్తలు