కుప్పకూలిన కుమారస్వామి ప్రభుత్వం

23 Jul, 2019 19:41 IST|Sakshi

విశ్వాస పరీక్షలో కుప్పకూలిన సంకీర్ణ ప్రభుత్వం

డివిజన్‌ పద్దతిలో ఓటింగ్‌

సాక్షి, బెంగళూరు: దేశమంతా ఎంతో ఉ‍త్కంఠగా ఎదురుచూసిన కర్ణాటక సంక్షోభం ముగిసింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓ పార్టీ, కాపాడుకోడానికి మరో పార్టీ రచించిన వ్యూహాలన్నీంటికి నేటితో తెరపడింది. బీజేపీ అనుకున్నట్లుగానే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. కుమారుస్వామి ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోవడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం పడిపోయినట్లు స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించారు. సీఎం కుమారస్వామి ఉద్వేగ ప్రసంగం అనంతరం.. స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ బలపరీక్ష నిర్వహించారు. మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. రెబల్స్‌ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. మరోవైపు బీజేపీ సభ్యులు 105 మంది సభకు హాజరయ్యారు. ఓటింగ్‌ జరిగిన సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులున్నారు. తొలుత ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్‌ ఆదేశించడంతో వారు ఆశీనులయ్యారు. ఓటింగ్‌ ముగిసే వరకు అసెంబ్లీ తలుపులను పూర్తిగా మూసివేశారు. అనంతరం డివిజన్‌ పద్దతిలో ఓటింగ్‌ నిర్వహించారు. అనంతరం విశ్వాస పరీక్షలో ప్రభుత్వ ఓడినట్లు స్పీకర్‌ ప్రకటించారు. దీంతో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలన నేటితో ముగిసింది.

మరోవైరు సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్‌, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు సభకు హాజరుకాలేదు. దీంతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అంతకుమందు విశ్వాస పరీక్షపై సీఎం కుమార స్వామి భావోద్వేగంగా మాట్లాడారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని,  సీఎంగా కన్నడ ప్రజలకు ఎంతో చేశానని ఉద్వేగంగా మాట్లాడారు. త్వరలో కుమారస్వామి గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు.

బెంగళూరులో 144 సెక్షన్‌
సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్‌-కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేంగా నినాదాలు చేస్తూ.. పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. రాజధాని ప్రాంతం బెంగళూరులో 144 సెక్షన్‌ అమలు చేశారు. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కుట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో రెండు రోజులపాటు బార్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. 

మరిన్ని వార్తలు