నా కొడుకుపై పద్మవ్యూహం

6 Apr, 2019 04:52 IST|Sakshi

కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య స్థానం నుంచి బరిలో ఉన్న తన కొడుకు నిఖిల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌ తదితరులు కలిసి పద్మవ్యూహం పన్నారని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. మహాభారత యుద్ధకాలంలో అర్జునుడి కొడుకు అభిమన్యుడిని చంపేందుకు కౌరవులు పద్మవ్యూహం పన్నినట్లుగా ఈ ఎన్నికల్లో నిఖిల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, ఇతరులు స్వతంత్ర అభ్యర్థి సుమలతతో కుమ్మక్కయ్యారన్నారు. ‘మాండ్యలో జరుగుతున్న పరిణామాలు చేయిదాటి పోయాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న సుమలతకు కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, రైతు సంఘాలు మద్దతిస్తున్నాయి. జేడీఎస్‌ను అణచివేయటానికి వీరంతా చేతులు కలిపారు’ అని శుక్రవారం ఆయన మీడియాతో అన్నారు.

ఈ వ్యాఖ్యలపై సుమలత స్పందించారు. ‘అవును, కాంగ్రెస్‌ కార్యకర్తలు నావెంటే ఉన్నారు. నన్ను ఓడించటానికి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి పద్మవ్యూహం పన్నారు’ అంటూ తిప్పికొట్టారు. ఎన్నికల సమయంలో ప్రజల మద్దతు పొందేందుకు పాక్‌తో యుద్ధభయాన్ని ప్రధాని మోదీ కల్పిస్తారని రిటైర్డు సైనికాధికారి ఒకరు రెండేళ్ల క్రితమే తనతో చెప్పారని సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా మాటలు గుర్తుంచుకోండి. లోక్‌సభ ఎన్నికలకు ముందు పాక్‌తో సంక్షోభం సృష్టించి, ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించి ఓట్లు పొందేందుకు మోదీ ప్రయత్నిస్తారు’ అని రెండేళ్ల క్రితమే రిటైర్డ్‌ సైనికాధికారి ఒకరు తనతో చెప్పినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు