నా జీవితంలోనే బిగ్‌ చాలెంజ్‌: కుమార స్వామి

22 May, 2018 21:33 IST|Sakshi

బెంగళూరు : కాంగ్రెస్‌ మద్దతుతో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించడం తన జీవితంలోనే పెద్ద సవాల్‌ అని జేడీఎస్‌ అధినేత, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఇక రేపు (బుధవారం) కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు ఆలయాలను సందర్శిస్తూ.. ఇష్ట దైవాలను దర్శించుకుంటున్నారు. మంగళవారం శ్రీనేగరిలోని ఆదిశంకరాచార్య ఆలయానికి సతీసమేతంగా వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జేడీఎస్‌-కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు కొనసాగించడం నాకు పెద్ద సవాల్‌. ముఖ్యమంత్రిగా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను. ఈ ప్రభుత్వం సరైన పాలనను అందిస్తుందా అని ప్రజల్లో కూడా సందేహాలున్నాయి. నాపై శారదాంబే, జగద్గురుల దీవెనలుంటాయి. వారి ఆశిస్సులతో అంతా మంచే జరుగుతోంది.’ అని కుమార స్వామి పేర్కొన్నారు.

నేడు కుమార స్వామి శ్రీనేగరి శారదాంబె ఆలయం, దక్షిణామయ పీఠంలను దర్శించుకున్నారు. కుమార స్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలతో పాటు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బీఎస్సీ అధినేత్రి మాయవతి, ఎస్పీనేత అఖిలేష్‌ యాదవ్‌, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు