23న కుమారస్వామి ప్రమాణం

20 May, 2018 03:06 IST|Sakshi
విధానసభలో కాంగ్రెస్, జేడీఎస్‌ సభ్యులతో కలసి కుమారస్వామి సంబరాలు

15 రోజుల్లో బలం నిరూపించుకోవాలన్న గవర్నర్‌

మంత్రివర్గంపై సోనియా, రాహుల్‌ను సంప్రదించాకే నిర్ణయమన్న కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి మే 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడు రోజులకే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి శాసనసభా పక్ష నేతగా ఉన్న కుమారస్వామిని శనివారం రాత్రి గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ‘గవర్నర్‌ ఆహ్వానం మేరకు ఆయనను కలుసుకున్నాను. కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం మే 15న సమర్పించిన వినతిపత్రం మేరకు మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించారు’ అని కుమార స్వామి చెప్పారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్‌ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 రోజుల్లో సభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆదేశించారని, అంతకంటే ముందుగానే బలపరీక్షకు వెళ్తామని తెలిపారు. మే 21న కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండవచ్చని తొలుత చెప్పిన ఆయన.. కాంగ్రెస్‌ నేతలతో భేటీ అనంతరం మే 23న ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అందుకు కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. మే 21న రాజీవ్‌ గాంధీ వర్ధంతి నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని మే 23కు మార్చారని జేడీఎస్‌ నాయకుడొకరు చెప్పారు. ‘మే 24న బలపరీక్షకు వెళ్లాలన్న అంశంపై కాంగ్రెస్‌తో చర్చించాం’ అని కుమారస్వామి పేర్కొన్నారు. మే 21న సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలిసి ధన్యవాదాలు చెపుతానని, అలాగే కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన ఎంత మంది మంత్రులుగా ఉండాలన్న అంశంపై వారితో చర్చిస్తానని ఆయన తెలిపారు.  

విపక్ష నేతలకు ఆహ్వానం
పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ చీఫ్‌ మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించామని కుమారస్వామి చెప్పారు. యూపీఏ చీఫ్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, మాయావతి, కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్‌ గెహ్లాట్, కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్‌ పరమేశ్వర, పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్‌–జేడీఎస్‌లు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాయని తెలిపారు. మరోసారి బీజేపీ తమ ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన కుమార స్వామి.. ‘వారు ఇబ్బందులు సృష్టిస్తారన్న విషయం తెలుసు. వాటిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు.
 

మరిన్ని వార్తలు