క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం

15 Jul, 2019 15:50 IST|Sakshi

బెంగళూర్‌ : మలుపులు తిరుగుతున్న కన్నడ రాజకీయాలు ఈనెల 18న క్లైమాక్స్‌కు చేరనున్నాయి. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సారథి, ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గురువారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటారని మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య నిర్ధారించారు. 18న ఉదయం 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుందని చెప్పారు.

విశ్వాస పరీక్ష తేదీపై సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలతో పాటు, బీజేపీ అంగీకరించాయి. కాగా, తమ రాజీనామాల ఆమోదంపై స్పీకర్‌కు సూచనలు ఇవ్వాలని రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై మంగళవారం కోర్టు వెలువరించే ఉత్తర్వులు విశ్వాస పరీక్షపై ప్రభావం చూపనున్నాయి. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా తమ రాజీనామాలను ఆమోదించకుండా జాప్యం వహిస్తున్నారని మరో ఆరుగురు రెబెల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదే కారణంతో పదిమంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 16మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసినట్టయింది. గతంలో పదిమంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌లోనే తాజా ఆరుగురు ఎమ్మెల్యేల విజ్ఞప్తినీ కలిపి విచారించాలని వారి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మొత్తం 16మంది రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ జరిపి.. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు