మాకు తగిన శాస్తి జరిగింది 

4 Aug, 2019 09:16 IST|Sakshi

నారాయణగౌడను  నమ్మి మోసపోయాం 

కేఆర్‌పేటలో  కుమారస్వామి కన్నీటిపర్యంతం

సాక్షి, బెంగళూరు: కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమరస్వామి మరోసారి కన్నీటిపర్యంతమయ్యారు.  మాండ్య జిల్లాలోని కేఆర్‌ పేట రాజకీయాల్లో తమ కుటుంబ స్వయంకృతాపరాధం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వాపోయారు. ఇక్కడి నుంచి జేడీఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచి సంకీర్ణంపై తిరుగుబాటు చేసిన నారాయణ గౌడను ఉద్దేశిస్తూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం మండ్య జిల్లాలోని కేఆర్‌పేటకు వచ్చిన ఆయన కార్యకర్తల సమావేశంలోను, మీడియాతో మాట్లాడారు.  కేఆర్‌ పేటలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కృష్ణకు కాకుండా నారాయణగౌడను నమ్మి టికెట్‌ ఇచ్చి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని అన్నారు.  నారాయణగౌడ గెలుపు కోసం గ్రామ గ్రామానికి తిరిగి పని చేçసి ఆయనను గెలిపిస్తే తన కుటుంబంపైనే ఆరోపణలు చేశాడని అన్నారు. అతడు క్రిమినల్‌ అని మండపడ్డ కుమరస్వామి, ఇదంతా మా కుటుంబం చేసుకున్న స్వయంకృతాపరాధమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు తుడుచుకున్నారు. 

రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు  
 తాను మనసులో ఏముంటే దానిని మాట్లాడతానన్న కుమారస్వామి...తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, రాష్ట్రంలో ఉన్న ప్రజల హృదయాల్లో ఉండిపోవాలని అనుకున్నానని అన్నారు.  పదవి పోయినా బాధ పడకుండా సంతోషంగా వదిలివచ్చానని అన్నారు.  దేశం కోసం తమ కుటుంబం ఎంతో చేసిందని, కానీ సోషల్‌ మీడియాలో నిఖిల్‌ ఎల్లిదియప్పా అని ప్రచారం జరగడం బాధగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాలు జరుగుతున్నాయని, రాజకీయాల్లో మంచికి కాలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ పరిణామాలతో తనకు రాజకీయాల్లో కొనసాగాలని అనిపించడం లేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. 

>
మరిన్ని వార్తలు