కర్ణాటకం ముగిసింది!

26 May, 2018 02:47 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేయడంతో సగం ఖాళీగా కనిపిస్తున్న విధానసభ

బలపరీక్షలో కుమారస్వామి విజయం

ఓటింగ్‌కు ముందే బీజేపీ వాకౌట్‌

స్పీకర్‌గా కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ కుమార్‌ ఏకగ్రీవం

ఐదేళ్లు సుస్థిర పాలన అందిస్తాం: కుమారస్వామి

మా పోరు జేడీఎస్‌పైనే: యడ్యూరప్ప

బెంగళూరు: కర్ణాటకలో దాదాపు పది రోజులుగా సాగిన రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య సీఎం పీఠం అధిరోహించిన సీఎం కుమారస్వామి అసెంబ్లీ బలపరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి సాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలుకుతూ శుక్రవారం ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్‌–జేడీఎస్‌ సర్కారు మూజువాణి ఓటుతో నెగ్గింది. బీజేపీ ఎమ్మెల్యేలు ముందే వాకౌట్‌ చేయడంతో అవాంతరాలు లేకుండా బలపరీక్ష ఘట్టం ముగిసింది. కాంగ్రెస్‌కు చెందిన 78, జేడీఎస్‌కు చెందిన 37, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలసి మొత్తం 117 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో కుమారస్వామి ప్రభుత్వం గెలుపొందింది. కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ కుమార్‌ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చివరి నిమిషంలో తమ స్పీకర్‌ అభ్యర్థిని బీజేపీ ఉపసంహరించుకోవడంతో పోటీ లేకుండానే ఎన్నిక పూర్తయింది. పార్లమెంటరీ సంప్రదాయాల్ని అనుసరించి తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు తన పట్ల నమ్మకం చూపనందుకు బాధగా ఉన్నా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని కుమారస్వామి అన్నారు.  బలపరీక్షలో కుమారస్వామిని ఓడించాలంటే 104 మంది సభ్యులున్న బీజేపీకి మరో 7గురు ఎమ్మెల్యేలు అవసరం. అయితే ఆ పార్టీ ముందే వాకౌట్‌ చేయడంతో అసెంబ్లీలో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోలేదు. వారం రోజుల వ్యవధిలో కర్ణాటక అసెంబ్లీలో ఇది రెండో బలపరీక్ష. మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో 19న రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌– జేడీఎస్‌ కూటమి తరఫున కుమారస్వామి మే 23న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

నమ్మకం చూపనందుకు బాధగా ఉంది
అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా నా పట్ల ప్రజలు నమ్మకం ఉంచనందుకు బాధగా ఉంది.  ఐదేళ్లు సుస్థిర పాలనను అందిస్తాం. మా సొంత ప్రయోజనాలను తీర్చుకునేందుకు అధికారంలోకి రాలేదు’ అని చెప్పారు. తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని, ఎక్కువ సమయం ప్రతిపక్షంలోనే ఉన్నామని పేర్కొన్నారు. ‘2006లో బీజేపీతో నేను సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడపై అపనింద పడింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో లౌకిక ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దానిని తొలగించాను’ అని చెప్పారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగానే రైతు రుణాలు మాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌లను దుర్వినియోగం చేస్తోందని కుమారస్వామి ఆరోపించారు.  

మంత్రిత్వ శాఖల పంపకంపై చర్చలు
బలపరీక్ష పూర్తవ్వడంతో మంత్రిత్వ శాఖల పంపకంపై జేడీఎస్‌–కాంగ్రెస్‌లు దృష్టిపెట్టాయి. శాఖల పంపిణీపై చర్చించేందుకు బలపరీక్ష పూర్తయిన కొద్దిసేపటికే ఇరు పార్టీల నేతలూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎల్పీ నేత సిద్దరామయ్య నివాసంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, కర్ణాటక కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్, జేడీఎస్‌ నేత హెచ్‌డీ రేవణ్న తదితరులు హాజరయ్యారు. మంత్రి పదవులపై అధిష్టానంతో చర్చించేందుకు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.

రైతురుణాల్ని మాఫీ చేయాలి
సభ నుంచి వాకౌట్‌కు ముందు ప్రతిపక్ష నేత యడ్యూరప్ప సీఎం కుమారస్వామిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌కు సీఎం పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. తన పోరాటం  కాంగ్రెస్‌పై కాదని, కుమారస్వామిపైనే అన్నారు. కుమారస్వామి నమ్మక ద్రోహం గురించి అందరికీ తెలుసని, కుమారస్వామి, దేవెగౌడలు కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేస్తారని ఆ పార్టీ సభ్యుల్ని హెచ్చరించారు. కుమార స్వామి సీఎంగా ఉండడం నచ్చకనే సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ. 53 వేల కోట్ల రుణాల్ని మాఫీ చేస్తానని కుమారస్వామి ప్రకటించారని, ప్రస్తుత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోనే దానిపై ప్రకటన చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు