త్యాగాలకు సిద్ధంకండి! 

25 Oct, 2018 03:35 IST|Sakshi
బుధవారం గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌. చిత్రంలో కుంతియా, జానారెడ్డి తదితరులు

     బుజ్జగింపులు ప్రారంభించిన కాంగ్రెస్‌

     90–95 సీట్లలోనే పార్టీ పోటీ.. సహకరించాలని విజ్ఞప్తి

     పార్టీ గెలుపునకు కృషి చేస్తే.. ‘నామినేటెడ్‌’ హామీ

     25న అధికార ప్రతినిధుల వర్క్‌షాప్‌.. 1 నుంచి బూత్‌స్థాయి సమావేశాలు

     టీపీసీసీ కీలక సమావేశంలో ఆర్‌సీ కుంతియా, ఉత్తమ్‌ వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్‌ బుజ్జగింపులు ప్రారంభించింది. పొత్తుల్లో భాగంగా అన్ని స్థానాల్లో పోటీచేసే అవకాశం ఉండదు కనుక.. అభ్యర్థులు సహకరించాలని కోరింది. 90–95 చోట్ల మాత్రమే పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని, మిగిలిన చోట్ల ఆశావహులు త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలన్న లక్ష్యం నెరవేరాలంటే పార్టీలోని కొందరు త్యాగం చేయాల్సి వస్తుందని, అంతమాత్రాన అలాంటి నేతలు నిరాశ చెందాల్సిన పనిలేదన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ నామినేటెడ్‌ పదవులిస్తామని వారు హామీ ఇచ్చారు. ‘పొత్తులు ఖాయం. కూటమిగా ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం చెప్పింది. టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం.

ఈ క్రమంలో మనం కొన్ని స్థానాల్లో పోటీచేయలేము. మొత్తం 5వేల మంది ఆశావహులు పార్టీ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో వెయ్యి మందిని స్క్రీనింగ్‌ చేయాలని రాహుల్‌ చెప్పారు. ఆ కార్యక్రమం పూర్తవుతోంది. కానీ మనం గరిష్టంగా 100 మందికి మాత్రమే టికెట్‌ ఇవ్వగలం. మిగిలిన వాళ్లు నిరాశ చెందవద్దు. తగిన న్యాయం చేస్తాం’అని కుంతియాపేర్కొన్నారు. బుధవారం గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ భేటీ జరిగింది. ముఖ్య నేతలతో పాటు ఆఫీస్‌ బేరర్లు, జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 45 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించాల్సిన తీరు, ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న అంశాలపై కీలక సూచనలు చేశారు. 

నవంబర్‌ 1 నుంచి బూత్‌ స్థాయి మీటింగ్‌లు 
ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ముందే ఈ నెల 25న పార్టీ అధికార ప్రతినిధులతో వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని కుంతియా తెలిపారు. అనంతరం 28, 29, 30 తేదీల్లో ఏదో ఒక రోజు ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టాలని, 31న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని నేతలకుసూచించారు. అనంతరం నవంబర్‌ 1 నుంచి 7 వరకు నియోజకవర్గాల్లో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని మార్గదర్శనం చేశారు. నియోజకవర్గ ఇంచార్జీలు ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానికంగా ఉండాలని, పార్టీ ప్రచార కార్యక్రమాలకు సమయం కేటాయించాలని, అలా ఇవ్వని పక్షంలో ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా, ఈ సమావేశంలో కూటమిలో సీట్ల పంపకాలపై ఎంపీ నంది ఎల్లయ్య నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాలమూరు జిల్లాలో పార్టీ బలంగా ఉందని, ఈ స్థానాలను టీడీపీకి సీట్లు కేటాయిస్తే తాను వ్యతిరేకిస్తానని చెప్పినట్లుగా సమాచారం. దీనిపై కుంతియా జోక్యం చేసుకుంటూ.. పొత్తులు పూర్తిగా రాహుల్‌ మార్గదర్శనం మేరకు జరుగుతున్నందున అందరూ సహకరించాల్సిందేనని స్పష్టం చేశారని సమాచారం.   

మరిన్ని వార్తలు