వసూళ్ల ‘సేన’ 

22 May, 2019 04:18 IST|Sakshi

కుప్పం జనసేన అభ్యర్థి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణ 

శ్రీకాళహస్తికి చెందిన లాయర్‌ ఎన్టీఆర్‌ వర్సిటీకి ఫిర్యాదు 

విచారణ చేపట్టాలని వీసీ ఆదేశం

తిరుపతి (అలిపిరి): ఎన్నికల్లో ఖర్చుల కోసం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ జనసేన అభ్యర్ధి డాక్టర్‌ వెంకటరమణపై ఎన్టీఆర్‌ వర్సిటీ వీసీ విచారణకు ఆదేశించారు. గత నెలలోనే ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ మెడిసిన్‌  ఫైనలియర్‌ చదువుతున్న డాక్టర్‌ వెంకటరమణ కుప్పం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన ఎన్నికల ప్రచార నిమిత్తం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని,  నగదును నేరుగా తన అకౌంట్‌లో వేయాలని పరోక్షంగా, ప్రత్యక్షంగా వేధించారని శ్రీకాళహస్తికి చెందిన లాయర్‌ కుమార్‌ ఎన్టీఆర్‌ వర్సిటీ వీసీకి, పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు  ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రవిప్రభును వీసీ ఆదేశించారు. ఈ అంశంపై జనసేన తిరుపతి అభిమానులు కూడా పవన్‌ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. 

ఎవరూ చెప్పలేదు
ఎన్టీఆర్‌ వర్సిటీ ఆదేశాల మేరకు వెంకటరమణ డబ్బుల కోసం విద్యార్థులను వేధించారనే కోణంలో విచారణ చేపట్టాం. డబ్బులు వసూలు చేశారని ఎవరూ చెప్పలేదు. 
– డాక్టర్‌ రవి ప్రభు, ప్రిన్సిపాల్, ఎస్వీఎంసీ, తిరుపతి

రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే 
నేను జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించాను. కొందరు నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఫిర్యాదు చేశారు. లాయర్‌ ఫిర్యాదులో వాస్తవం లేదు. విద్యార్థుల వద్ద ఒక్క పైసా తీసుకోలేదు. 
– వెంకటరమణ, పీజీ వైద్య విద్యార్ధి, ఎస్వీఎంసీ, తిరుపతి

మరిన్ని వార్తలు