దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్యాకేజీ

14 May, 2020 04:46 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు. చిత్రంలో మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డి

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో మృతులకు రూ.కోటి పరిహారం ఇచ్చాం

13 వేల టన్నుల స్టైరీన్‌ దక్షిణ కొరియాకు తరలించాం

మరే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు 

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దమ్మున్న సీఎం అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన నేపథ్యంలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారం రాత్రి విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై ఉన్న వారికి రూ.10 లక్షలు, రెండు రోజులకు మించి ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.లక్ష చొప్పున.. ఊహించనంత పరిహారం అందజేయడం, ఎల్‌జీ పాలిమర్స్‌లో ఉన్న 13 వేల టన్నుల స్టైరీన్‌ గ్యాస్‌ను దక్షిణ కొరియాకు వెనువెంటనే తరలించడం వంటి చర్యలు ఆయన దమ్మున్న సీఎం అనే విషయాన్ని మరోసారి రుజువు చేశాయన్నారు. ఇంకా ఏం చెప్పారంటే.. 

► గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశంలో మరే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దేశ చరిత్రలో ఇదే అతి పెద్ద ప్యాకేజీ. 
► మృతుల్లో 8 కుటుంబాల వారికి రూ.కోటి చొప్పున చెల్లించాం. నలుగురి కుటుంబ వారసులకు గురువారం అందజేస్తాం. 
► కేజీహెచ్‌లో రెండు రోజులకు పైగా చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు రూ.లక్ష చెల్లిస్తున్నాం. ప్రమాదం జరిగిన ఐదు రోజుల్లోగానే పరిహారం చెల్లించిన ఘనత జగన్‌కే చెల్లింది. 
► బాబు హయాంలో నగరంలో జరిగిన గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడు ఘటన, పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్‌ సరదా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి ఎంత పరిహారమిచ్చారో ఆయన గుర్తు చేసుకోవాలి.  
► ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో బాబు డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉంది.  
ఎల్‌జీ పాలిమర్స్‌ కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్స్‌కు బాబే అనుమతులిచ్చారు. 2015లో 128 ఎకరాల అప్పన్న భూములను చంద్రబాబే ధారాదత్తం చేశారు. దీనిపై చర్చకు వస్తారా?

బాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు
పోతిరెడ్డిపాడుపై ఈనెల 5నే జీవో విడుదల చేసినా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇప్పటివరకు తన అభిప్రాయాన్ని ఎందుకు చెప్పలేదని ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేని ప్రతిపక్ష నేత ఒక నేతా అని నిలదీశారు. 
► విశాఖకు వ్యతిరేకంగా ఆయన ఎంతకైనా తెగిస్తారు. అందులోభాగంగానే ఎల్లో మీడియాలో కుట్రపూరిత రాతలు రాయిస్తున్నారు. అమరావతిపై ప్రేమతో విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. 
► విలేకరుల సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

మృతుని భార్యకు రూ.కోటి చెక్కు 
స్టైరీన్‌ లీకైన ఘటనలో మృతి చెందిన ఆంధ్రా బ్యాంక్‌ విశ్రాంత మేనేజర్‌ గంగాధర చౌదరి భార్య ఎస్‌.లక్ష్మికి రూ.కోటి చెక్కును ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం అందజేశారు. మృతుని భార్య లక్ష్మి మాట్లాడుతూ ఇంత త్వరగా పరిహారం అందిస్తారని ఊహించలేదని అన్నారు.  

మరిన్ని వార్తలు