పేదోడి ఇంటిపైనా అబద్ధాలేనా?

7 Jun, 2020 06:01 IST|Sakshi

పిచ్చి కూతలు, రాతలు ఇకనైనా ఆపండి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపాటు

బాబూ.. ఇన్ని లక్షల ఇళ్లు కడుతున్నామని కడుపుమంటా?

జూలై 8న 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు.. 

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే చంద్రబాబు, ఆయన ముఠా ఓర్వ లేక విష ప్రచారానికి దిగడం దారుణం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలనే కార్యక్రమం యజ్ఞంలా సాగుతోందన్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున (జూలై 8) ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి సీఎం జగన్‌ చరిత్రకెక్కనున్నారన్నారు. ఆ తర్వాత ఆగస్టు 26న 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణాలు, భూ సేకరణపై హౌసింగ్‌ విభాగం ప్రత్యేక కార్యదర్శి అజయ్‌జైన్‌తో కలిసి శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే పెద్ద లక్ష్యాన్ని సీఎం జగన్‌ నిర్దేశించుకున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంకా ఏమన్నారంటే..

► ఒక రాజకీయ నాయకుడు ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉండాలో వైఎస్‌ జగన్‌ నిరూపించారు. కరోనా లాంటి విపత్కర సమయంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేశారు.
► చంద్రబాబు రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు, లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిపోయినా రాష్ట్రంలోని కోట్లాది మంది అకౌంట్లలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నగదు జమ చేశారు. 
► మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా 25 లక్షలకు బదులు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు జగన్‌ ఇవ్వబోతుంటే చంద్రబాబు, ఆయన బృందం, ఆయనకు వత్తాసు పలుకుతున్న మీడియా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.
► 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యమా అని చాలా మంది మాట్లాడారు. కానీ ఇప్పటికే 26.77 లక్షల మందిని అర్హులుగా గుర్తించి గ్రామ సచివాలయాల్లో జాబితా ప్రదర్శించాం. మే నెలలో కొత్తగా వచ్చిన 6.08 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. వీటిలో సగానికిపైగా అర్హత ఉన్నాయనుకున్నా ఆ సంఖ్య 30 లక్షలకు దాటుతుంది. 

మీ హయాంలో కంటే తక్కువ ధరే..
► ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే చంద్రబాబులా గృహ ప్రవేశాలు చేయాలని ఇక్కడ ఎవరూ అనుకోవడం లేదు. టిడ్కో వంటి సంస్థలకు రూ.3వేల కోట్లు, హౌసింగ్‌ కార్పొరేషన్‌కు రూ.1300 కోట్లు బకాయిలు పెట్టి పారిపోవాలనుకోవడం లేదు. వాటిని మేము తీరుస్తున్నాం. అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు. 
► గతంలో చంద్రబాబు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు సేకరించిన భూమికి ఎకరానికి రూ.49.27 లక్షలు, 2018లో ధవళేశ్వరం వద్ద టిడ్కో కోసం 24 ఎకరాలను ఎకరం రూ.64 లక్షల చొప్పున కొన్నారు. కానీ ఈవేళ అదే ప్రాంతంలో మేము ఇచ్చింది ఎకరానికి రూ.45 లక్షలు మాత్రమే.  
► ఇళ్ల స్థలాలకు డబ్బులు తీసుకుంటున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదు. పూర్తి పారదర్శకతతో జరుగుతున్న ప్రక్రియ ఇది. లాటరీ విధానంలో ఇళ్ల స్థలాలను కేటాయిస్తారు. ఎవరైనా డబ్బులు అడిగితే స్పందనలో లేదా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. అబద్ధాలు చెప్పడం వల్లే ఇవాళ చంద్రబాబు ఆ స్థానంలో ఉన్నారు.
► రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని అజయ్‌ జైన్‌ చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, లబ్ధిదారులను జియో ట్యాగింగ్‌ చేస్తున్నామని చెప్పారు.  
► సమావేశంలో ముఖ్య కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, హౌసింగ్‌ ఎండీ జీఎస్‌ నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

యుద్ధ ప్రాతిపదికన లే అవుట్లు 
► దేశంలో ఎక్కడా ఇంత పారదర్శకతతో ఏ పథకం అమలు కావడం లేదు. ఇంటి స్థలాన్ని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. గజం రూ.25 వేలు, రూ.30 వేలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంటి స్థలాలు ఇస్తున్నారు.
► ఇళ్ల స్థలాల కోసం 42 వేల ఎకరాలను సమకూర్చాం. అవసరమైతే మరింత సేకరిస్తాం. రూ.6,500 కోట్లు కేటాయించి.. ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు వెచ్చించాం. లే అవుట్లు యుద్ధ ప్రాతిపదికన తయారవుతున్నాయి. 

మరిన్ని వార్తలు