ప్రభుత్వాన్ని, సీఎంను కించపరిచేలా ఈనాడు రాతలు

14 Jul, 2020 05:51 IST|Sakshi

‘గోదారి ఈసారీ.. ముంపు దారి’.. అంటూ బురదజల్లే యత్నం

చంద్రబాబు పోలవరం అసలు డ్యాం వదిలి కాఫర్‌ డ్యాం నిర్మించడం వల్లే ముంపు సమస్య 

ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా రాతలు 

సకాలంలో వర్షాలు రావడం కొంతమందికి బాధగా ఉంది 

చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీకి అధ్యక్షుడిలా యనమల మాటలు 

ఈ పధ్నాలుగు నెలల్లోనే రాష్ట్రం పేదరికంలోకి వెళ్లిపోయిందా? 

తప్పుడు స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దు..  

చెప్పినట్టుగా రాసే.. చూపించే మీడియా ఉందన్నదే చంద్రబాబు ధైర్యం 

మీడియా సమావేశంలో మంత్రి కురసాల కన్నబాబు మండిపాటు 

కాకినాడ రూరల్‌: రాష్ట్రంలో సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పుష్కలంగా వర్షాలు పడుతున్నాయని.. కరువు పీడిత జిల్లాల్లోనూ వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహించి రిజర్వాయర్లు నిండాయని.. ఇది కొంతమందికి బాధగా ఉందని.. దీంతో మనసులో ఏదో ఒకటి పెట్టుకుని ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బురదజల్లుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఆక్షేపించారు. ఈనాడు దినపత్రికలో సోమవారం గత ఏడాది ఫొటో పెట్టి ‘గోదారి ఈసారీ.. ముంపు దారి!’ కథనంపై ఆయన ఘాటుగా స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా లచ్చిగూడెం గిరిజనులు నీటిబిందెలను తలపై పెట్టుకుని గోదావరి వరదలో నడిచి వస్తున్న ఫొటో వేసి గిరిజనులు ఇబ్బంది పడ్డారని రాశారని.. చంద్రబాబు లోపాలు బయట పడకుండా, మీకు అనుకూలంగా ప్రయత్నం చేస్తే ఫర్వాలేదని.. కానీ, ప్రస్తుత ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలను కించపర్చడం బాగోలేదని మంత్రి మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా గ్రామాలకు ముంపు వచ్చినా పట్టించుకోలేదని రాయడం దుర్మార్గమన్నారు. ఈ అంశంపై మంత్రి కన్నబాబు సోమవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

► చంద్రబాబు అత్యాశవల్ల పోలవరం అసలు డ్యామ్‌ను వదిలేసి, కాఫర్‌ డ్యామ్‌ను ముందు నిర్మించారు. దీనివల్లే అప్పుడు గోదావరి ముంపు వచ్చింది. 
► గత ఏడాది లాంగెస్ట్‌ ఫ్లడ్‌ నమోదైంది. గోదావరి, కృష్ణా వరదలు ఎక్కువ కాలం ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో తక్షణ సహాయం అందించాం అప్పట్లో ఇంటింటికీ వంట సరుకులు, బియ్యంతో పాటు రూ.5 వేల చొప్పున ఇచ్చాం. సహాయ పునరావాస చర్యలు తీసుకున్నాం. శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాం. 
► ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో ఉదయం మాట్లాడాను. వరదలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల్లో వరదలను ఎదుర్కొనేందుకు ప్రత్యేకాధికారులను నియమించారు. పైగా.. చంద్రబాబు హయాంలో లేని అనేక సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇలా అన్ని చర్యలూ తీసుకుంటుంటే.. పాత ఫొటో వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా రాశారు. 

పేదరికం, ఆర్థిక అసమానతలు ఇప్పుడే కనిపించాయా? 
► చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీకి అప్రకటిత అధ్యక్షుడిలా యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్ల పేదరికం, ఆర్థిక అసమానతలు పెరిగాయని ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ 14 నెలల్లోనే రాష్ట్రం పేదరికంలోకి వెళ్లిపోయిందంట. అసమానతలు వచ్చేశాయట. మీ మధ్య వచ్చి ఉంటాయి అసమానతలు.. మీరు సంపాదించుకునే అవకాశం పోయింది. అందుకే అంతలా బాధపడుతున్నారు. 
► యనమల చెప్పినదాని ప్రకారం.. 2018–19లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం రూ.6,140 కోట్ల సాయం చేసిందట. 2019–20లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.3,382 కోట్లే ఇచ్చిందంటున్నారు. జనం నవ్వుతారని కూడా ఆయనకు లేదు. మా ప్రభుత్వం 14 నెలల్లో సంక్షేమ పథకాలు రద్దు చేసిందని చెబుతున్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పసుపు–కుంకుమ రద్దుచేయడంవల్ల ప్రజలు రూ.18,026 కోట్లు నష్టపోయారట. ఆర్థిక మంత్రిగా చాలా కాలం పనిచేసిన యనమలకు ఈ లెక్కలు ఎవరిచ్చారు? 

అభాండాలు మానుకోండి.. 
► ఇక 3 లక్షల ఉద్యోగాలు తీసివేశామంటూ కళా వెంకట్రావు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలిచ్చారు. 1.40 లక్షల ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో, 2 లక్షలకు పైగా వలంటీర్లను తీసుకున్నారు. బ్యాక్‌లాక్‌ పోస్టులు భర్తీచేస్తున్నారు. 
► అభాండాలు మానుకోండి. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వీకరిస్తాం. 
► చెబితే రాసే మీడియా, చూపించే మీడియా ఉందన్నదే చంద్రబాబు ధైర్యం. అందువల్లే అబద్ధాలు రాయిస్తున్నారు. 

14 నెలల్లో రూ.42,603 కోట్లతో ‘సంక్షేమం’ 
► వాస్తవానికి ఈ 14 నెలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపులకు వివిధ సహాయ, సంక్షేమ పథకాల కింద మా ప్రభుత్వం రూ.42,603 కోట్లు అందించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏదో ఒక పథకంలో లబ్ధిపొందిన వారు 3.97 కోట్ల మంది ఉన్నారు. ఇందులో టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు.  
► మా ప్రభుత్వం వచ్చిన తరువాత 18 లక్షల రేషన్‌ కార్డులు, 6 లక్షల పెన్షన్లు తీసేశామని యనమల చెబుతున్నారు. అవగాహన ఉండి చెబుతున్నారా? బురద చల్లితే వాళ్లే కడుక్కుంటారులే అని భావిస్తున్నారా? కార్డులు ఎక్కడ తీసేశామో చెప్పాలి. పెద్దపెద్ద కార్లలో తిరిగిన మీ టీడీపీ నాయకులవి పోయి ఉంటాయి. 
► మొత్తం 21 పథకాలు అమలుచేస్తున్నాం. ఏ పథకం ఎత్తేశామో యనమల చెప్పాలి. 
► అసలు విషయాలు వదిలేసి, బురదజల్లడం మంచి పద్ధతి కాదు. 
► చంద్రబాబు వలలో పడి ఇటువంటి కథనాలు రాయడం సరికాదని.. తప్పుడు స్టేట్‌మెంట్లు చేయవద్దని యనమలకు చెబుతున్నా. 

మరిన్ని వార్తలు