-

గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు : కన్నబాబు

5 Apr, 2020 14:47 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కరోనా నేపథ్యంలో రాష్ట్ర రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. మొక్కజొన్న రైతుల కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సచివాలయంలో అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌ వద్ద రైతులు నమోదు చేసుకోవాలని సూచించారు.

అరటి ధరలు పడిపోకుండా చూడాలని ఉద్యానవన శాఖకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏపీ సీడ్స్‌ ద్వారా ఇప్పటికే లక్ష క్వింటాళ్ల విత్తనాలు కొనుగోలు చేశామని, 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సేకరించామని చెప్పారు. మరో 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సేకరిస్తున్నామని చెప్పారు.దళారులను నమ్మి పంటను తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులను కోరారు. ఆక్వా రైతులు నష్టపోకుండా ప్రాసెసింగ్‌ యూనిట్లు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించముందే పేద ప్రజలకు సీఎం జగన్‌ రూ.వెయ్యి ఆర్థిక సాయం ప్రకటించారని గుర్తుచేశారు. పేదలకు ఆర్థిక సాయం అందిస్తుంటే టీడీపీ నేతలకు ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. కరోనాను కూడా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు చౌకబారు విమర్శిలు మానుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు