ఇంట్లో కూర్చొని బురద జల్లుతారా?

30 Apr, 2020 12:35 IST|Sakshi
కాకినాడ క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి కురసాల కన్నబాబు

ముఖ్యమంత్రిని తగ్గించి చూపేందుకు కుట్ర  

ఉత్తరాలతో సమయం గడిపే పద్ధతి మార్చుకోవాలి

చంద్రబాబు తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం

కాకినాడ రూరల్‌:  కరోనా ప్రభావంతో కష్టకాలంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు అండగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి పనిచేస్తుండగా చంద్రబాబునాయుడు మాత్రం ఇంట్లో కూర్చొని ఖాళీ సమయంలో ఉత్తరాలు రాసుకుంటూ  ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు. కాకినాడ వైద్యనగర్‌ క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయంగా ఆయన హెరిటేజ్‌ సంస్థలోనే కరోనా వ్యాప్తి చెందుతుంటే ఆ ఉద్యోగులనే దాచేస్తూ కేసులను ప్రభుత్వం దాచేస్తోందని బురద జల్లడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే, ప్రధాన ప్రతిపక్షనేతగా 40 రోజుల్లో రాష్ట్రంలో ఎందుకు అడుగుపెట్టలేదని, ఎందుకు భయపడుతున్నాని ప్రశ్నించారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నేమాంలో కల్లు గీత కార్మికులకు నష్టం చేయడానికి చెట్లు నరికివేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ రోజు నేమాం వెళితే అక్కడ 200 చెట్లు కూడా లేవని స్థానికులు చెబుతున్నారన్నారు. 33 వేల ఎకరాల్లో చెట్లు తీయకుండా ఏ విధంగా అమరావతిని మహానగరం చేద్దామనుకున్నారో తెలపాలని నిలదీశారు.  

40 రోజుల్లో మూడోసారి రేషన్‌  
లాక్‌డౌన్‌ ప్రారంభమైన తరువాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం మూడో విడతగా రేషన్‌ పంపిణీ ప్రారంభమైందన్నారు. అర్హత కలిగిన దాదాపు 1.47 కోట్ల తెల్ల రేషన్‌ కార్డు కలిగిన పేదలకు రేషన్‌ ఇస్తున్నామన్నారు. బియ్యంతోపాటు కందిపప్పు అందిస్తున్నామన్నారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తల్లుల ఖాతాల్లో వేయాలన్నది ముఖ్యమంత్రి తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాత బకాయిలు విడుదల చేయడం, మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయడం, మరోవైపు మే 15కు రైతు భరోసా అమలు చేయడానికి సన్నద్ధమవడం ముఖ్యమంత్రి సంకల్పానికి నిదర్శనమన్నారు. తుపానుకు తడిసిన ధాన్యం ధరను తక్కువకు కొనుగోలు చేస్తే మిల్లర్లపై చర్యలకు వెనకాడమన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో ఇదే విషయమై మాట్లాడానన్నారు. 

మరిన్ని వార్తలు