రైతులకు పసుపు పత్రాలు ఎందుకు ఇచ్చారు?

26 Jul, 2019 09:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేయకుండా.. ఇప్పుడు రుణమాఫీ చేస్తారా లేదా అంటూ తమని ప్రశ్నిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మొత్తం రూ. 87 వేల కోట్ల రైతు రుణ మాఫీ ఉంటే.. టీడీపీ టీడీపీ సర్కార్‌ దానిని రూ. 24 వేల కోట్లకు కుదించిందన్నారు. శుక్రవారం శాసనసభ సమావేశాలు  ప్రారంభం కాగానే స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీపై సభ్యులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వాటికి సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం నాలుగు, ఐదు విడతల్లో రుణమాఫీ డబ్బులు ఇవ్వదలచుకుంటే.. రైతులకు పసుపు పత్రాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పైగా వాటికి ఎటువంటి వ్యాలిడిటీ లేదన్నారు. మార్చి 10 సాయంత్రం ఈ మేరకు జీవో ఇచ్చారన్నారు. టీడీపీకి రైతులను ఆదుకునే ఆలోచన ఉంటే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి 24 గంటల ముందు ఎందుకు జీవో ఇస్తారని నిలదీశారు. 

టీడీపీ ప్రభుత్వం రైతు రుణమాఫీని మధ్యలో వదిలేసి అన్నదాత సుఖీభవ ప్రకటించిందని తెలిపారు. రుణమాఫీకే డబ్బులు ఇవ్వలేకపోయారని.. అలాంటిది అన్నదాత సుఖీభవకు ఎక్కడి నుంచి నిధులు తీసుకువస్తారని ప్రశ్నించారు. ఓట్ల కోసమే టీడీపీ ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని అప్పటికప్పుడే ప్రారంభించిందని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. వాటిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అడిగే అధికారం టీడీపీకి ఎక్కడుందని నిలదీశారు. కనీసం రైతులకు విత్త బకాయిలు కూడా టీడీపీ చేయలేదని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు