తిట్టుకున్న ‘తమ్ముళ్లు’

15 Feb, 2020 13:27 IST|Sakshi
కేశవయ్య గౌడ్, ధర్మవరం సుబ్బారెడ్డి వాగ్వాదం

నాగేశ్వరరావు యాదవ్‌తో కోట్రికె ఫణిరాజ్‌ వాగ్వాదం  

ధర్మవరం సుబ్బారెడ్డిని ఎత్తి పొడిచిన పెద్ద కేశవయ్య గౌడ్‌  

కర్నూలు, డోన్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం ఏర్పాటుచేసిన టీడీపీ డోన్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నేతల ప్రమేయముందని పోలీసుల విచారణలో వెల్లడికావడంతో శుక్రవారం జరిగిన సమావేశం పట్ల పార్టీ కార్యకర్తలు ఆసక్తి కనబరిచారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే సభావేదిక ఏర్పాటులో లోటుపాట్లపై రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్‌.. కార్యక్రమ నిర్వాహకులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కోట్రికె ఫణిరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. చేతకాకపోతే కార్యక్రమాల నిర్వహణ నుంచి తప్పుకోవాలని నాగేశ్వరరావ్‌ అనగా.. చేతకాని వాళ్లే ఎక్కువ మాట్లాడతారని ఫణిరాజ్‌ దీటుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది.

ధర్మవరం సుబ్బారెడ్డి వర్సెస్‌ పెద్ద కేశవయ్య గౌడ్‌ ..
గత ఎన్నికల్లో పార్టీ ఓటమిపై డోన్‌ మాజీ సర్పంచ్‌ పెద్ద కేశవయ్య గౌడ్‌ మాట్లాడుతుండగా.. ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్‌ ధర్మవరం సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎలా పాల్గొంటావని ధర్మవరం సుబ్బారెడ్డి ఆగ్రహంతో కేశవయ్య గౌడ్‌ వైపు దూసుకువెళ్లి ప్రశ్నించారు. దీనికి కేశవయ్య గౌడ్‌ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ టీడీపీలో ఉండి కూడా నీ మాదిరి ద్వంద్వ ప్రమాణాలు పాటించనని ఎత్తిపొడిచారు. దీంతో ఒక్కసారిగా సమావేశం రసాభాసాగా మారింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ కలుగచేసుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. నకిలీ మద్యం వ్యవహారంలో స్పష్టత ఇస్తారని ఆశించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సమావేశం తీవ్ర నిరాశ కలిగించింది. పార్టీ ఓడిన తర్వాత కూడా టీడీపీ అగ్ర నాయకులు ఆత్మ విమర్శ చేసుకోకుండా పరస్పరం నిందించుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం చూసి కార్యకర్తలు నివ్వెరపోయారు. ఇలాంటి వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సమైక్యంగా నిలబడి పార్టీని ఎలా గెలిపించగలరనే సందేహాన్ని టీడీపీ కార్యకర్తలు బాహాటంగావ్యక్తపరుస్తున్నారు.  

మరిన్ని వార్తలు