రూ.560 కోట్లు ఎవరివి?

2 Apr, 2019 13:08 IST|Sakshi
కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కర్త కుష్బూ

చెన్నై  ,పెరంబూరు: కంటైనర్‌లో పట్టుబడ్డ ఆ రూ.560 కోట్ల సంగతేంటీ? అది ఎవరి డబ్బు? అంటూ నటి, కాంగ్రెస్‌ పార్టీ ప్రచారకర్త కుష్బూ ప్రశ్నించారు. సోమవారం వేలూరు సమీపం కాట్పాడిలోని డీఎంకే ప్రముఖ నేత శ్రీనివాసన్‌ ఇంట్లోనూ, గోడౌన్లలోనూ ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించగా కట్ట కట్టలుగా డబ్బు బయటపడింది. ఆ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారితీసింది.

ఈ దాడులపై కుష్బూ స్పందిస్తూ ఎన్నికల అధికారులు జరిపిన సోదాల్లో కట్టలు కట్టలు డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారన్నారు. సోదాలు చేయండని, అదే విధంగా అది ఎవరి డబ్బు, ఎంత అన్నది కూడా బయట పెట్టవచ్చు తప్పులేదు అన్నారు. అయితే గత రెండేళ్ల క్రితం కంటైనర్‌తో సహా రూ.560 కోట్లు పట్టుకున్నారుగా, అది ఎవరిదీ, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమయ్యింది? అని ప్రశ్నించారు. అదే విధంగా ఒక మంత్రి ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగానే ఒక వ్యక్తి అందరూ చూస్తుండగానే చేతిలో పత్రంతో పారిపోయారు. ఆ పత్రంలో ఏముందీ? దాని గురించి విచారించారా? ఆ వివరాలు ఏవీ? ఇంత వరకూ చెప్పలేదే అని ప్రశ్నించారు.

టమాట చట్నీయా?
ఇప్పటివరకు పట్టుబడిన నగదుపై.. జరిగిందేదో జరిగింది. దాన్ని మరచిపోదాం అంటారా? మీకు వస్తే రక్తం, మాకు వస్తే టమాట చట్నీయా? ఎన్నికల ఆధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే తప్పులేదు అని కుష్బూ అన్నారు. 

మరిన్ని వార్తలు