కుష్బుకు కాంగ్రెస్‌ పగ్గాలు ?

17 Oct, 2017 05:35 IST|Sakshi

పార్టీ అధిష్టానం పరిశీలన

పోటీలో మరికొందరు

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్ష స్థానానికి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, నటి కుష్బు పేరు పరిశీలనలో ఉంది. అదే జరిగితే టీఎన్‌సీసీకి తొలిసారిగా ఒక మహిళ అధ్యక్షురాలు అయిన ఘనత ఆమెకు సొంతం అవుతుంది. తమిళనాడు కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికలు ఇటీవల ముగిశాయి. సుమారు 19 ఏళ్ల విరామం తరువాత సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి కొత్త అధ్యక్షుని ఎన్నిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఇటీవలే తీర్మానం చేశారు.

తిరునావుక్కరసర్‌పై ఫిర్యాదులు
ప్రస్తుతం తమిళకాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌పై అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో కాంగ్రెస్‌ ట్రస్టు నిర్వాహకుల మూలంగా పార్టీ కోశాధికారి వోరా విచారణ చేపట్టి టీఎన్‌సీసీకి కొన్ని సూచనలు చేశారు. ట్రస్టు పర్యవేక్షణకు కేరళకు చెందిన రిటైర్డ్‌  ఐఏఎస్‌ అధికారి నియమితులయ్యారు. చెక్‌ పవర్‌ను సైతం అతని స్వాధీనంలోకే వెళ్లింది. ఈ నేపథ్యంలో తమిళ కాంగ్రెస్‌ అధ్యక్షుని నియామకంపై పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టిపెట్టగా, తన పదవిని కాపాడుకునేందుకు తిరునావుక్కరసర్‌ ఢిల్లీలో పావులు కదపడం ప్రారంభించారు. రాహుల్‌గాంధీని సైతం ఆయన కలుసుకోగా అది ఎంతవరకు ఫలించిందో తెలియరాలేదు. తిరునావుక్కరసర్‌కు ముందు అధ్యక్షునిగా ఉండిన ఈవీకేఎస్‌ ఇళంగోవన్, మరికొందరు ముఖ్యులతో రాహుల్‌ సుదీర్ఘ చర్చలు జరిపారు. కొత్త అధ్యక్షుని పరిశీలన జాబితాలో కుష్బుతోపాటూ ఇళంగోవన్, కేఎస్‌ అళగిరి, చెల్లకుమార్, వసంతకుమార్, పీటర్‌ ఆల్‌బోన్స్, మాణిక్య ఠాకూర్‌ తదితర పేర్లున్నాయి.

ఏ బాధ్యతలు అప్పగించినా సిద్ధం
ఈ సందర్భంగా కుష్బును పలుకరిస్తే అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధమని బదులిచ్చారు. ఇళంగోవన్‌కు కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం మద్దతు పలుకుతున్నారు. ఇళంగోవన్‌ను కాదనుకున్న పక్షంలో తన మద్దతుదారైన కేఎస్‌ అళగిరికి ఇవ్వాల్సిందిగా ఇళంగోవన్‌ కోరారు. మాణిక్యఠాకూర్‌ పార్టీ పరంగా రాహుల్‌తో ప్రత్యక్ష సంబంధాలు, ఢిల్లీ స్థాయిలో పలుకుబడి కలిగి ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో మహిళా అధ్యక్షురాలు ఉన్నందున కాంగ్రెస్‌ పార్టీకి సైతం కుష్బు ఉంటే సమజోడిగా ఉంటుందనే వాదనను ఆమె అభిమానులు అధిష్టానం ముందుంచినట్లు సమాచారం. ఈనెల 21వ తేదీ నుంచి ఢిల్లీలో కార్యవర్గ సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే తమిళనాడు కాంగ్రెస్‌ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళుతాయో తేలిపోగలదని పార్టీ శ్రేణుల అంచనా. 

మరిన్ని వార్తలు